అసోం అల్లర్లు: 200 మంది అరెస్టు

17 Dec, 2019 12:50 IST|Sakshi
గౌహతిలోని నిరసనకారులు వాహనాలకు నిప్పంటిస్తున్న దృశ్యం(ఫైల్‌)

గౌహతి: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో హింసాకాండ చెలరేగుతోంది. వేలాదిమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడం లేదా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకూ చోటుచేసుకున్న అల్లర్లలో ఒక కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తతో పాటు సుమారుగా 200 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 136 మందిపై కేసులు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్‌ భాస్కర్‌ జ్యోతి మహంతా ప్రకటించారు. అరెస్టులతోపాటు, అస్సాం  రాష్ట్రమంతటా సుమారు 3 వేలకుపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, ఇందులో హింసకు పాల్పడుతున్న ప్రముఖ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారని వివరాలను వెల్లడించారు. అయితే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్న అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చి విడిచిపెడుతున్నామని తెలిపారు.
 


అస్సాంలో చెలరేగుతున్న అల్లర్లను అడ్డుకట్టవేసి ప్రభుత్వ ఆస్తులను, ప్రజలను పరిరక్షించేందుకుగాను పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారని అస్సాం పోలీసు ప్రధానాధికారి మహంతా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులను అదుపులో ఉన్నాయని  తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం  పార్లమెంటు ఆమోదం పొందిన అనంతరం అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి మతపరమైన హింస కారణంగా భారత్‌కు వచ్చిన ముస్లిమేతరు శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం లభించేందుకు వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంతో ముప్పుఉందని ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి హక్కులకు ఎటువంటి భంగం చేకూరదని ప్రభుత్వం స్థానికులకు హామీ ఇచ్చింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా