పుల్వామా ఉగ్రదాడి; గువాహటి ప్రొఫెసర్‌ అరెస్టు

18 Feb, 2019 13:18 IST|Sakshi

గువాహటి : 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడిపై యావత్‌ భారతదేశం ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది ఆ ఘటనను సమర్థించే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జవాన్ల మరణాన్ని ఉటంకిస్తూ రెచ్చగొట్టే విధంగా ఫేస్‌బుక్‌ పోస్టు పెట్టిన పాప్రీ బెనర్జీ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప్రీ బెనర్జీ గువాహటిలోని ఐకాన్‌ కామర్స్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ క్రమంలో పుల్వామా దాడి అనంతరం... ‘నిన్నటి ఘటనలో 45 మంది సాహసవంతులైన యువకులు హత్యకు గురయ్యారు. ఇదేమీ యుద్ధం కాదు. దాడి చేసిన వారిపై ప్రతిదాడి చేసేందుకు వారికి సమయం దొరకలేదు. నిజంగా పిరికి పంద చర్యకు పరాకాష్ట ఈ ఘటన. ఇది ప్రతీ ఒక్క భారతీయుని హృదయాన్ని కకావికలం చేసింది... కానీ... కానీ.. కానీ.. లోయలో భద్రతా బలగాలు చేయని అకృత్యాలు ఉన్నాయా! అక్కడి మహిళలపై మీరు అత్యాచారం చేశారు... వాళ్ల పిల్లల్ని చంపారు... వాళ్ల భర్తలను హతమార్చారు.. మీ మీడియా వారందరినీ తక్కువగా చూపే ప్రయత్నమే చేసింది... అయినంత మాత్రాన ప్రతీకారం ఉండదని భావించారా??? అసలు మీకో విషయం తెలుసా.. ఉగ్రవాదం ఇస్లాంకు చెందినదే కావొచ్చు.. కానీ కర్మ అనేది హిందూ సనాతన ధర్మంలోనిది.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవించండి’ అంటూ పిప్రీ ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే కథనాన్ని రాసుకొచ్చారు. దీంతో ఆమెపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆదివారం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు