మంచుకొండల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత!!

30 May, 2014 09:41 IST|Sakshi

వేసవి సెలవలు వచ్చాయి కదా అని ఏదైనా చల్లటి ప్రదేశానికి వెళ్దామనుకుంటున్నారా? అయితే పొరపాటున కూడా జమ్ముకు మాత్రం వెళ్లద్దు. ఎందుకంటే, అక్కడ మన హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం నాడు హైదరాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత కేవలం 40.1 డిగ్రీల సెల్సియస్ అయితే జమ్ములో ఏకంగా 41.8.. అంటే దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఇంతవరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

అంతేకాదు.. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. వేడి బాగా ఎక్కువగా ఉండటంతో జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రోడ్ల మీద ఎక్కడా ట్రాఫిక్ అన్నది కనపడలేదు. మార్కెట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు మూసేసినా, ప్రభుత్వ పాఠశాలు మాత్రం పనిచేస్తున్నాయి. వేడి బాగా ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరై రావాల్సి వస్తే.. గొడుగులు తప్పకుండా వేసుకు రావాలని చెప్పారు.

మరిన్ని వార్తలు