‘సదైవ్‌ అటల్‌’ను ప్రారంభించిన రాష్ట్రపతి 

26 Dec, 2018 02:57 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్‌పేయి 94వ జయంతి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం వాజ్‌పేయి స్మారకార్థం రాష్ట్రీయ స్మృతి స్థల్‌ సమీపంలో నిర్మించిన ‘సదైవ్‌ అటల్‌ మెమోరియల్‌’ను రాష్ట్రపతి ప్రారంభించారు. దీనిని దేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. వాజ్‌పేయి కలలుగన్న భారత్‌ను నిర్మించి తీరతామని ఆయన ఉద్ఘాటించారు. వాజ్‌పేయికి నివాళులర్పించిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు ఉన్నారు. సదైవ్‌ అటల్‌ మెమోరియల్‌ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10.51 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ నిర్మాణానికి కావాల్సిన నిధులను అటల్‌ స్మృతి న్యాస్‌ సొసైటీ అందించింది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, బిహార్‌ గవర్నర్‌ లాల్‌జీ తాండన్, గుజరాత్‌ గవర్నర్‌ ఓపీ కొహ్లీ, కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా సహా పలువురు బీజేపీ నేతలు ఈ సొసైటీకి వ్యవస్థాపకులుగా ఉన్నారు.    

మరిన్ని వార్తలు