వాజ్‌పేయి కోలుకుని మళ్లీ స్పీచ్‌లు ఇస్తారు!

16 Aug, 2018 15:59 IST|Sakshi
మీడియాతో కాంతి మిశ్రా

మాజీ ప్రధాని బంధువుల ఆకాంక్ష

సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని బంధువులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలం నుంచి వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మేనకోడలు కాంతి మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రసంగాలను మళ్లీ వినే అవకాశం వస్తుందన్న ఆశ మాకు ఉంది. వాజ్‌పేయితో మా అనుబంధాలు, అప్యాయతలు చిరకాలం గుర్తుండిపోతాయి. మా మనసులో ఆయనకు ఉన్న స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆయన మళ్లీ కోలుకుని సాధారణ స్థితికి వస్తారని’ కాంతి మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

వాజ్‌పేయి కుటుంబ సభ్యులు మరికొందరు మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ‘వాజ్‌పేయి అందరినీ ప్రేమగా పలకరించేవారు. స్థానికంగా ఉండేవారిపై కూడా ఆప్యాయత చూపేవారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తుల్లో వాజ్‌పేయి ఒకరు. రాజకీయాల గురించి ఇంట్లో ప్రస్తావించేవారు కాదు. శత్రువుల మనసుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన. ధనం కూడబెట్టడం రాజకీయం కాదని.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉండటమే ముఖ్యం అనేవారు. ఇంటి వంటను ఎక్కువగా ఇష్టపడేవారు. నేను అనే అహం లేకుండా మనం అనే స్వభావం కలిగిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి. వివాద రహితుడిగా జీవితాన్ని గడిపిన అతికొద్ది మంది నేతల్లో ఆయన ఒకరని’ మాజీ ప్రధాని వాజ్‌పేయి విశిష్టతను ఆయన బంధువులు షేర్‌ చేసుకున్నారు. గ్వాలియర్‌, ఆగ్రాల్లో ఉన్న ఆయన బంధువులు ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకుంటున్నారు.

ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా, బీజేపీ నేతలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు గురువారం వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. మాజీ ప్రధాని నివాసం వద్ద, ఎయిమ్స్‌ ఆస్పత్రి పరిసర ప్రాంగణాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తలు