లైవ్‌ అప్‌డేట్స్‌ : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

17 Aug, 2018 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించారు. దత్త పుత్రిక నమితా భట్టాచార్య చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు స్మృతిస్థల్‌లో త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తదితరులు బహుముఖ ప్రజ్ఞాశాలి వాజ్‌పేయికి తుది వీడ్కోలు పలికారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాజ్‌పేయికి కడసారి నివాళులర్పించారు. మరోవైపు అంతియయాత్రలో దారి పొడవునా అటల్‌ జీ అమర్‌ రహే నినాదాలతో మార్మోగిపోయింది. తొలుత వాజ్‌పేయి కన్నుమూసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌కు తరలించారు.

అనంతరం వాజ్‌పేయి పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించగా, ఆయనకు ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ ముఖ్యమంత్రి యూపీ సీఎం ఆదిత్యానాథ్‌ యోగిలు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.  పార్టీలకు అతీతంగా బీజేపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, ప్రజలు తరలివచ్చి వాజ్‌పేయికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

  • దత్త పుత్రిక నమితా భట్టాచార్య తన చేతుల మీదుగా చితికి నిప్పంటించి మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమ సంస్కారాలను శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
  • హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సాయంతో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహిస్తోన్న దత్త పుత్రిక నమితా భట్టాచార్య, ఇతర కుటుంబసభ్యులు
  • తాత అటల్‌జీ నుంచి తరచుగా బహుమతులు అందుకునే నిహారిక చివరిసారి కానుకగా ఆయన పార్థీవదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని అందుకున్నారు. ఉద్వేగానికి లోనవుతూ త్రివర్ణ పతాకాన్ని వెంట తీసుకెళ్లారు.

  • త్రివిధ దళాధిపతులు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధానికి తుది వీడ్కోలు.
  • మహానేత వాజ్‌పేయికి నివాళుతర్పించిన పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌
  • మాజీ ప్రధాని వాజ్‌పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య స్మృతి స్థల్‌కు చేరుకుంది.
  • వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం స్మృతి స్థల్‌కు బయలుదేరిన బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌.
  • నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌లు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని వాజ్‌పేయి పార్థివ దేహానికి అంజలి ఘటించనున్నారు.

  • వాజ్‌పేయి అంతియయాత్రలో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, పార్టీ నేతలు
  • విజయ్‌ ఘాట్‌ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్‌పేయి మెమోరియల్‌కు ఏర్పాట్లు పూర్తి
  • ఢిల్లీకి చేరుకున్న అఫ్ఘానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ ఖర్జాయ్‌. వాజ్‌పేయి అంతియాత్ర స్థలానికి బయలుదేరిన ఖర్జాయ్‌
  • రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో రాజనీతిజ్ఞుడు, ప్రజల నేత వాజ్‌పేయి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • అంతిమయాత్ర కొనసాగుతున్న దీన్‌ దయాల్‌ మార్గ్‌ రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.
  • ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు కాలి నడకన వాజ్‌పేయి అంతిమయాత్రలో పాల్గొన్నారు
  • కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయి పార్థివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు బీజేపీ కురు వృద్ధుడు ఎల్‌ కే అద్వానీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌లు నివాళులు అర్పించారు.
  • వైఎస్సార్‌సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అక్తర్‌, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
మరిన్ని వార్తలు