బిహార్‌ వరదలు : 29 మంది మృతి

30 Sep, 2019 14:13 IST|Sakshi

పట్నా : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్‌ తడిసిముద్దయింది. వరద తాకిడితో సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కాగా, 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 32 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న రాజధాని పట్నా నగరంలో వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 235 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో పట్నాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్‌ 1 వరకూ మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరోవైపు భారీ వర‍్షపాతంపై తాము రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశామని వాతావరణ శాఖ చెబుతుండగా, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాత్రం తమ ప్రభుత్వానికి వాతావరణ విభాగం నుంచి భారీ వర్షాలపై ఎలాంటి నిర్ధిష్ట సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం​.

మరిన్ని వార్తలు