వైరస్‌ భయం.. బెంగళూరులో ఏటీఎంల బంద్‌

16 May, 2017 07:49 IST|Sakshi
వైరస్‌ భయం.. బెంగళూరులో ఏటీఎంల బంద్‌

బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘వన్నా క్రై’ కంప్యూటర్‌ వైరస్‌ భయం బెంగళూరును కూడా తాకింది. దీంతో ముందుజాగ్రత్తగా పలుచోట్ల ఏటీఎంలను మూసివేశారు. మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా వన్నా క్రై అనే ర్యాన్సమ్‌వేర్‌ కంప్యూటర్లకు వ్యాపిస్తూ ఆన్‌లైన్లో విధ్వంసం సృష్టిస్తుండడం తెలిసిందే. ఈ వైరస్‌ సోకిన కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. అందులోని సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. హ్యాకర్లు డిమాండ్‌ చేసినంత డబ్బు చెల్లిస్తేగానీ కంప్యూటర్‌ మళ్లీ పనిచేయదు.

ఈ క్రమంలోనే బెంగళూరులో సోమవారం సాయంత్రం నాటికి కొన్ని ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలను అనధికారికంగా మూసివేశారు. ఏటీఎంలలో ప్రస్తుతం విండోస్‌ఎక్స్‌పీ ఆపరేటింగ్‌ సిస్టం ఉందని దీనిలో భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. దీంతో వన్నా క్రై మాల్‌వేర్‌ను తట్టుకునేలా విండోస్‌ ఎక్స్‌పీని అప్‌డేట్‌ చేయడం కోసం ఏటీఎంలను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. బెంగళూరే కాకుండా మైసూరు, మంగళూరు, హుబ్లి–ధార్వాడ, బళ్లారి తదితర నగరాల్లోనూ అనేకచోట్ల ఏటీఎంలను బ్యాంకులు మూసివేశాయి. 

మరిన్ని వార్తలు