ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా

23 Apr, 2020 03:40 IST|Sakshi

వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు..

ఇంటి యజమానులు, స్థానికులు వైద్యులను వేధిస్తే కేసే!

ఆర్డినెన్స్‌కి కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, కోవిడ్‌–19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్‌ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఆశ కార్యకర్తలు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిపై దాడులు చేస్తే తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదన్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని, ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుందని జవదేకర్‌ వివరించారు.

ఆస్తి నష్టం జరిగితే, ఆ ఆస్తి మార్కెట్‌ విలువకు రెట్టింపు వసూలు చేస్తామన్నారు. కోవిడ్‌–19కు చికిత్స అందించే లేదా కరోనా వ్యాప్తిని నిర్ధారించే విధుల్లో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది తమతో పాటు కరోనా వైరస్‌ను తీసుకువస్తున్నారనే అనుమానంతో వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమానులు, స్థానికులు ఆయా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసినా, వేధింపులకు పాల్పడినా ఈ చట్టం కింద కఠిన చర్యలుంటాయన్నారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ఎపిడమిక్‌ డిసీజెస్‌ చట్టం, 1897కు సవరణలు చేస్తామన్నారు.

కరోనా విపత్తు ముగిసిన అనంతరం కూడా ఈ చట్టంలోని నిబంధనలను కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు పూర్తి వివరణ ఇవ్వకుండా.. ‘ఎపిడమిక్‌ చట్టానికి సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ ఇది, అయితే, ఇది మంచి ప్రారంభం’అని మాత్రం వ్యాఖ్యానించారు. కోవిడ్‌–19పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ. 50 లక్షల బీమా కల్పిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని జవదేకర్‌ గుర్తు చేశారు. కరోనా పేషెంట్ల కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.86 లక్షల బెడ్స్, 24 వేల ఐసీయూ బెడ్స్‌తో 723 కోవిడ్‌ ఆసుపత్రులను సిద్ధం చేశామన్నారు.  

రూ. 15 వేల కోట్ల ప్యాకేజీ
కరోనాపై పోరుకు అవసరమైన అత్యవసర నిధి కోసం రూ. 15 వేల కోట్లతో ‘ఇండియా కోవిడ్‌–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ప్యాకేజ్‌’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ల్యాబొరేటరీల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ మొత్తంలో రూ. 7,774 కోట్లను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఫండ్‌ కింద వినియోగించాలని, మిగిలిన మొత్తాన్ని ఒకటి నుంచి నాలుగేళ్లలో ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.

కోవిడ్‌చికిత్సకు వాడే వైద్య పరికరాలు, ఔషధాలను సమకూర్చుకోవడంతో ఇతర అత్యవసరాల కోసం, ప్రత్యేక లాబొరేటరీలు, పరిశోధనశాలల ఏర్పాటుకూ నిధులు వాడతారు.  ప్యాకేజీ కింద అదనంగా, రూ. 3 వేల కోట్లను ప్రస్తుతమున్న వైద్య సదుపాయాలను కోవిడ్‌  వైద్య కేంద్రాలుగా ఆధునీకరించడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే అందజేశారు. ‘ల్యాబొరేటరీ నెట్‌వర్క్‌ను విస్తరించాం. రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. 13 లక్షల టెస్టింగ్‌ కిట్స్‌ కోసం ఆర్డర్‌ పెట్టాం’ అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.  

భద్రతలో రాజీలేదు: మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తాజాగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ స్పష్టం చేస్తుందన్నారు. ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు