పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన

5 Jan, 2020 02:59 IST|Sakshi
ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల నిరసన

ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయం వద్ద నిరసన

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్‌ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్‌ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పాక్‌ రాయబార కార్యాలయం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా చాణక్యపురి పోలీస్‌స్టేషన్‌ వద్దే వారిని పోలీసులు నిలువరించారు.

బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడే రోడ్డుకిరువైపులా నిలబడి పాక్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిక్కు నేతలు పాక్‌ రాయబారికి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి దాడులు జరక్కుండా పాక్‌ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కోరారు. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో మత వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సబబేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌ పేర్కొన్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేత మీనాక్షి లేఖి, పాక్‌ మంత్రి ఫవాద్‌ ట్విట్టర్‌లో విమర్శలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు