పార్లమెంట్‌ చర్చిస్తుంటే మేం కల్పించుకోవద్దా?

27 Oct, 2017 01:56 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ చర్చిస్తోందన్న కారణంతో తాము ఫలానా అంశం నుంచి దూరంగా ఉండలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయ విచారణ ప్రక్రియలో కోర్టులు పార్లమెంట్‌ కమిటీల నివేదికలపై ఆధారపడొచ్చా లేక వాటిని ప్రస్తావించొచ్చా అన్న విషయంపై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ విధంగా స్పందించింది. వివాదాస్పద హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) టీకా పరీక్షలను నిర్వహించిన ఔషధ కంపెనీలను తప్పు పడుతూ పార్లమెంట్‌ స్థాయీ సంఘం 2014లో సమర్పించిన నివేదికను పిటిషన్‌దారులు ప్రస్తావించారు.

‘ న్యాయ సమీక్ష అధికారంలో ఎలాంటి మార్పు లేదు. పార్లమెంట్‌ చర్చిస్తోంది కదా అని మేం ఆ విషయం నుంచి దూరంగా ఉండలేం. పౌరుల హక్కుల పరిరక్షణకు ముందుకు సాగుతాం. పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దంటే కుదరదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని నిబంధన 142 ప్రకారం తమకు  కమిషన్లు ఏర్పాటు చేసి విచారణ జరిపించి, నివేదికలు కోరే హక్కు ఉందన్న సంగతిని బెంచ్‌ గుర్తుచేసింది. అంతకుముందు, ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ స్పందిస్తూ...పార్లమెంట్, పార్లమెంట్‌ కమిటీల ప్రత్యేకాధికారాలు, శాసన–న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజనను ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు