బెంగళూరులో పర్యటించిన ఆస్ట్రేలియా మంత్రి

27 Feb, 2020 20:50 IST|Sakshi

బెంగళూరు: ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక శాఖా మంత్రి సిమన్‌ బర్మింగ్‌హాం బెంగళూరులో పర్యటించారు. నూతన ఆవిష్కరణలు, అంతరిక్ష రంగంలో భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునే క్రమంలో ఆయన పలు కంపెనీలను సందర్శించారు. ఇందులో భాగంగా ఇన్నోవేషన్‌ కేపబిలిటీ సెంటర్‌లో ఉన్న ఆస్ట్రేలియా టెలికాం కంపెనీ టెల్‌స్ట్రా పనితీరును పరిశీలించారు. అనంతరం టెక్నోవేషన్‌ సెంటర్‌లో సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేథ తదితర విభాగాల్లో విప్రో కంపెనీ సేవలు అందిస్తున్న తీరు... ఆస్ట్రేలియాతో కలిసి పనిచేయడం తదితర అంశాల గురించి చర్చించారు. అంతేకాకుండా నూతనంగా ఆవిష్కరించిన ఆస్ట్రేలియన్‌ స్పేస్‌ ఏజెన్సీ గురించి ఇస్రో అధికారులతో చర్చించారు.

అనంతరం పలువురు ఆస్ట్రేలియా, భారత వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సిమన్‌ బర్మింగ్‌ హాం సమావేశమయ్యారు. ఆ తర్వాత వారితో కలిసి ఆల్కెమీలో భోజనం చేశారు. కాగా నూతన ఆవిష్కరణల అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ- హబ్‌(హైద్రాబాద్‌)లోని ఓ కంపెనీతో సిడ్నీ ఒప్పందం కుదుర్చుకుంది. 


 

>
మరిన్ని వార్తలు