పెట్రోల్‌ ధరలపై ప్రశ్నించినందుకు బీజేపీ నేత దాడి

17 Sep, 2018 20:09 IST|Sakshi
మీడియాతో బీజేపీ నాయకురాలు తమిళసై సౌందర రాజన్‌ (ఇన్‌ సెట్‌లో ఆటోడ్రైవర్‌)

చెన్నై: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పెరిగిన ధరలతో కడుపు మండిన ఓ ఆటోడ్రైవర్‌ ఓ బీజేపీ సీనియర్‌ నేతను ప్రశ్నిస్తే అతనిపై చేయిచేసుకున్నారు. ఈ విచారకర ఘటన సోమవారం చెన్నైలోని సైదాపేటలో తమిళనాడు బీజేపీ ఛీఫ్‌ తమిళిసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడుతుండగా చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఆ వీడియోలో ఏముందంటే.. సౌందర్యరాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రిపోర్టర్లు అడుగుతున్న ప్రశ్నలను వింటున్నారు. ఇంతలో ఖాకీ డ్రెస్‌ వేసుకున్న ఓ పెద్దాయన మధ్యలో కలుగజేసుకుని పెరిగిన ఇంధన ధరలను ప్రస్తావించాడు. దీంతో ఆమె పక్కనే ఉన్న మరో బీజేపీ నేత వి కాళీదాస్‌ ఆగ్రహంతో ఆ వ్యక్తిని నెట్టేస్తూ చేయిచేసుకున్నాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్‌ అయింది.

అనంతరం మీడియా ఆ ఆటోడ్రైవర్‌ను సంప్రదించగా.. ‘నేను ఓ ఆటో డ్రైవర్‌. పెరిగిన ఇంధన ధరలు నా జీవనశైలిపై ప్రభావం చూపుతున్నాయి. ఆమె ప్రభుత్వ చేసిన మంచి పనులు గురించి మాట్లాడటం నేను విన్నాను. దీంతో పెట్రోల్‌ డీజిల్‌ ధరలపై అడగాలనిపించి  ఆమె ఓ వీఐపీ కదా అని అడిగాను. అక్కడ ఒకరు నాపై చేయిచేసుకున్నారు. రోజువారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. మేం రూ.100ల పెట్రోల్‌ కొట్టించి ఆటో నడిపితే మాకు అంతకంటే ఎక్కువ రావడం లేదు. మా కష్టం అంతా మా ఆటో పెట్రోల్‌కే సరిపోతుంది. ఆటో నడుపుకుంటునే జీవిస్తున్నాం. పండుగలొస్తున్నాయి. మేం మరింత కష్టపడి సంపాదించాలి. కానీ పెరిగిన ఇంధన ధరలతో సంపాదించడం కష్టంగా మారింది’ అని తన బాధను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85గా ఉంది.  

మరిన్ని వార్తలు