‘మెట్రో’ రాకతో సీన్ మారింది..!

18 Jun, 2014 22:37 IST|Sakshi
‘మెట్రో’ రాకతో సీన్ మారింది..!

 సాక్షి, ముంబై: ఇటీవల ప్రారంభమైన మెట్రోరైలు పుణ్యమా అని ఆటో డ్రైవర్ల పెత్తనానికి పుల్‌స్టాప్ పడింది. మొన్నటి వరకు ఆటోల కోసం ప్రయాణికులు పడిగాపులు కాసేవారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. అప్పుడు ఇష్టమున్నట్లు చార్జీలు వసూలు చేసిన ఆటోవాలాలు ఇప్పుడు ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నిర్దేశించిన మీటరు ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నా గిరాకీలు దొరకడం కష్టంగా మారిపోయింది.

మొన్నటివరకు ఘాట్కోపర్ లేదా అంధేరిలో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు తమ కార్యాలయాలకు చేరుకోవాలంటే ఆటో లేదా బెస్ట్ బస్సు ఎక్కాల్సిందే. కిక్కిరిసిన బెస్ట్ బస్సుల కంటే షేర్ ఆటోలో వెళ్లడమే నయమని భావించే చాలామంది ఆటోలనే ఆశ్రయించేవారు. దీన్ని అదనుగా చేసుకుని అటోవాలాలు అడ్డగోలుగా వసూలు చేసేవారు.
 
ఎవరైనా ఆటోలో ఒంటరిగా వెళ్లాలనుకుంటే ఇక వారి జేబుకు చిల్లిపడ్డట్లే.. మీటరు వేయకుండానే ఇష్టానుసారం డిమాండ్ చేసేవారు. అదేమని నిలదీస్తే మరో ఆటో చూసుకోవాలని పెత్తనం చెలాయించేవారు. దీంతో కార్యాలయానికి చేరుకోవాలనే తొందరలో డ్రైవర్లతో ఎవరూ వాగ్వాదానికి దిగేవారు కాదు.
 
ఇప్పుడు సీను మారింది.. మెట్రో రైలు రావడంతో అంధేరి, ఘాట్కోపర్ ప్రాంతాల మధ్య ఉన్న కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూల్‌గా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మెట్రోలోనే ప్రయాణించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీలు దొరకడం కష్టతరంగా మారింది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రావడంవల్ల ఇక్కడ పనిచేసే అన్ని వర్గాల ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు