ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా

4 Sep, 2019 20:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొత్త చట్టం ప్రకారం విధించిన జరిమానాలు చూసి షాక్‌ తిన్నారు. ఆర్టీవో అధికారులు తాజాగా ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, లైసెన్స్‌ సక్రమంగా లేకపోవడంతో అధికారులు అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు.

బుధవారం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మోటార్‌ వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఆటో డ్రైవర్‌ హరిబంధు కన్హార్‌కు రూ. 47,500 జరిమానా విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై హరిబంధు మాట్లాడుతూ, తాను ఇంత మొత్తం జరిమానా చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కావాలంటే అధికారులు తన వాహనాన్ని సీజ్‌ చేయాలని, లేకుంటే తనను జైలుకు పంపాలని కోరారు. ఇంటి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఆటో డ్రైవర్‌కు విధించిన జరిమానా వివరాలు
సాధారణ జరిమానా - రూ. 500
డ్రైవింగ్‌ లైసెన్స్‌ సరిగా లేనందుకు - రూ. 5,000
పర్మిట్‌ లేకుండా వాహనం నడిపినందుకు - రూ. 10,000
మద్యం సేవించి వాహనం నడిపినందుకు - రూ. 10,000
పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేనందుకు - రూ. 10,000
వాహనం నడిపేందుకు వేరే వ్యక్తిని అనుమతించినందుకు - రూ. 5,000
ఆటో రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ లేనందుకు - రూ. 5,000
ఇన్సూరెన్స్‌ లేనందుకు - రూ. 2,000

మరిన్ని వార్తలు