మోడీ ప్రధాని అయితే ఆటోమేటిగ్గా అమెరికా వీసా!

1 Apr, 2014 10:48 IST|Sakshi
మోడీ ప్రధాని అయితే ఆటోమేటిగ్గా అమెరికా వీసా!

ప్రధానమంత్రిగా ఎన్నికైతే నరేంద్ర మోడీకి ఆటోమేటిగ్గా అమెరికా వీసా వచ్చేస్తుందా? దాదాపుగా అవుననే అంటున్నాయి అమెరికా వర్గాలు. భారతీయులు ఎవరిని ప్రధానిగా ఎంచుకున్నా వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఇటీవల విడుదల చేసిన ఓ మెమోలో మోడీకి ఆటోమేటిగ్గా వీసా వస్తుందన్న విషయం ఉంది. అయితే ఆ మెమో గురించి మాత్రం తనకు ఇంకా తెలియదని, కానీ ప్రధాని ఎవరైనా కూడా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే తమ ఉద్దేశమని మేరీ హార్ఫ్ అన్నారు. దేశాన్ని ఎవరు నడిపించాలో భారతీయులే నిర్ణయించుకుంటారని, వాళ్లు ఎవరిని నిర్ణయించినా ఆ నాయకుడితో కలిసి తాము ముందుకెళ్తామని ఆమె చెప్పారు.

ఒకవేళ మోడీ ప్రధాని అయితే, ఆయనకు ఎ-1 (దౌత్యపరమైన) వీసా దానంతట అదే వచ్చేస్తుందని, ఆయన ఏ ఉద్దేశంతో పర్యటన చేసినా వీసా అదే వచ్చేస్తుందని సీఆర్ఎస్ ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణుడు రూత్ ఎలెన్ వసీం తెలిపారు. నరేంద్రమోడీపై ఇంతకుముందున్న అభియోగాలేవీ ఎ-1 వీసాకు అడ్డం కాబోవని ఆయన అన్నారు. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామాతో భారత అమెరికా సంబంధాలకు ఎలాంటి లింకు అవసరం లేదని మార్ఫ్ స్పష్టం చేశారు. పావెల్ ఇప్పటికే 37 ఏళ్ల పాటు సేవలు అందించారని, ఇక పదవీ విరమణ చేయాలనుకోవడం సహజమేనని చెప్పారు.

మరిన్ని వార్తలు