అవని మోహన భావన విజయం

8 Mar, 2019 04:21 IST|Sakshi
అవనీ చతుర్వేదీ, భావనా కాంత్, మోహన సింగ్‌

ముదితల్‌ నేర్వగ రాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్‌... చాలా పాతకాలపు మాటే. కానీ... ఈ కాలంలో అది వాళ్లను కించపరచడమే! అవకాశం దొరకాలేగానీ.. మహిళలు రాణించని రంగమంటూ లేదనేందుకు చరిత్రే సాక్ష్యం! ఓ ఇందిరాగాంధీ.. ఇంకో సునీతా విలియమ్స్‌.. మరో ఇంద్ర నూయీ! ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే స్త్రీ శక్తి విజయాలకు తార్కాణాలు కోకొల్లలు! తాజా ఉదాహరణలు కావాలా...   అవని.. మోహన... భావనల జైత్రయాత్ర చూడండి!!!

హైదరాబాద్‌ శివార్లలోని హకీంపేట్‌... ఆకాశంలో రయ్యి రయ్యి మంటూ విమానాలు దూసుకెళుతున్నాయి!!   ఆకాశంలో సగమే కాదూ... అంతా మాదేనన్న ఆత్మవిశ్వాసంతో.. ఈ ముగ్గురు మూలపుటమ్మలు ముందడుగేశారు!!  
 
అభినందన్‌ వర్ధమాన్‌ నడిపిన మిగ్‌ – 21 బైసన్‌.. ధ్వనివేగంతో పోటీపడే సుఖోయ్‌–ఎంకే21, మిరాజ్‌ –2000లనూ అలవోకగా చక్కర్లు కొట్టిస్తున్నారు! ఇంకో కొన్ని నెలలు గడిస్తే.. పుల్వామా తరహా ఉగ్రదాడులకు దీటైన సమాధానం చెప్పే వాయుసేనలో అవనీ చతుర్వేదీ, భావనా కాంత్, మోహన సింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోవద్దు! దశాబ్దాల నిషేధాలు, ఆంక్షలను తోసిరాజంటూ 2016లో అవని చతుర్వేది భారతీయ వాయుసేనలో తొలి యుద్ధవిమాన పైలట్‌గా చరిత్ర సృష్టించగా.. ఆ తరువాత కొద్ది కాలానికే భావనా కంఠ్‌... మోహన సింగ్‌లు చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వీర వనితలు హకీంపేటలోని వాయుసేన శిక్షణ కేంద్రంలో తమ నైపుణ్యాలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. ఇప్పటికే పలు యుద్ధవిమానాలను నడపడంలో సిద్ధహస్తులైన ఈ ముగ్గురు ఎప్పుడెప్పుడు సుఖోయ్, మిరాజ్‌ కాక్‌పిట్‌లలోకి చేరిపోయి.. భారతీయ మహిళల సత్తాను ఆకాశానికి చేర్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  

భారత త్రివిధ దళాల్లో మహిళల పాత్ర ఏమిటన్నది ఒక్కసారి చూసుకుంటే కొంచెం నిరాశ ఆవహించక మానదు. ఆర్మీ, నేవీల్లో ఇప్పటికే మహిళల ప్రమేయం కేవలం వైద్య, దంత సేవలకు పరిమితం కాగా.. ఒక్క వాయుసేనలో మాత్రం 13 శాతం మహిళలు పనిచేస్తున్నారు. మూడు రక్షణ దళాలను పరిగణనలోకి తీసుకున్నా సరే.. మహిళల శాతం చాలా తక్కువ. వైద్య, దంత సేవల్లో 21.63, 20.75 శాతం మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధరంగంలో తుపాకీ పట్టేందుకూ మహిళకు అవకాశమివ్వాలన్న వాదన చాలాకాలంగా నడుస్తున్నా.. 2015 అక్టోబరులో ఇందుకు అనుమతిస్తూ భారతీయ వాయుసేన చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌లో ఉండే ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఉన్న మొత్తం 120 మంది కేడెట్ల నుంచి యుద్ధవిమానాల శిక్షణ కోసం 37 మందిని ఎంపిక చేయగా.. కఠినాతి కఠినమైన పరీక్షలకు ఓర్చి ఈ ముగ్గురు తుదిజాబితాలో స్థానం సంపాదించుకున్నారు. మిగిలిన వారిలోనూ ముగ్గురు మహిళలు ఉండగా.. వారిని హెలికాప్టర్, రవాణా విమానాలు నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు.

అవని చతుర్వేది
ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌

పుట్టింది: అక్టోబరు 27, 1993
కుటుంబం: తండ్రి దినకర్‌ చతుర్వేది మధ్యప్రదేశ్‌ నీటివనరుల విభాగంలో ఇంజినీర్‌. తల్లి గృహిణి, అవని అన్న కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు.
విద్య:  షాడోల్‌ జిల్లాలోని డియోలాంగ్‌లో పాఠశాల విద్య, రాజస్తాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయం నుంచి బీటెక్‌.  
ఘనతలు: సూరత్‌గఢ్‌లోని వాయుసేన 23వ స్క్వాడ్రన్‌లో చేరారు. మిగ్‌ –21 బైసన్‌ను నడిపిన తొలి మహిళా పైలట్‌.  
ఇష్టాఇష్టాలు: చదరంగం, టేబుల్‌ టెన్నిస్‌లపై మక్కువ ఎక్కువ.
స్ఫూర్తి: అన్నే. కాలేజీ ఫ్లైయింగ్‌ క్లబ్‌లో చిన్నసైజు విమానాలను నడిపిన అనుభవమూ ఉంది.  
 

ఏ వాయుసేనకైనా అందులోని యోధులే కీలకం. యుద్ధవిమాన పైలట్‌ కావాలన్నది నా కల. ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధవిమానాలను నడపాలని.. ప్రతిరోజూ కొత్తకొత్త విషయాలు నేర్చుకోవాలని  కోరుకుంటున్నా.
– అవని చతుర్వేది

భావన కంఠ్‌
ఫ్లయింగ్‌ ఆఫీసర్‌

పుట్టింది: 1992, బిహార్‌లోని దర్భంగ జిల్లాలో
కుటుంబం:  తండ్రి తేజ్‌ నారాయణ్‌ కంఠ్‌.. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌.  
విద్య: రాజస్తాన్‌లోని కోటలో ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ శిక్షణ పొందారు. మహిళలకు అనుమతి లేకపోవడంతో అప్పట్లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని బీఎంఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చదివారు. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఎంపికై వాయుసేనలో చేరారు. తొలిదశ శిక్షణలో భాగంగా యుద్ధవిమానాలు నడిపేందుకు ఎంపికయ్యారు.
ఘనతలు:  అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ అంటే మక్కువ ఎక్కువ. వాయుసేనలో రెండో దశ శిక్షణలో భాగంగా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో కిరణ్‌ విమానాలను నడిపారు. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న అనుభవమూ భావన కంఠ్‌ సొంతం.

మోహన సింగ్‌
ఫ్లైట్‌ ఆఫీసర్‌


పుట్టింది: రాజస్తాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలో.  
కుటుంబం: తండ్రి వాయుసేనలోనే వారంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. తాత లాడూ రామ్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఫ్లైట్‌ గన్నర్‌. 1948 భారత్‌ – పాక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. వీర్‌ చక్ర అవార్డు గ్రహీత కూడా.  
విద్య: అమృత్‌సర్‌లోని గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో గ్రాడ్యుయేషన్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బీటెక్‌ చేశారు. 2013లో 83.7 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.
ఘనతలు: తండ్రి ప్రతాప్‌ సింగ్‌ విధులు నిర్వర్తిస్తున్న చోటే ట్రెయినీ కేడెట్‌గా చేరడం.

మరిన్ని వార్తలు