ఇంతకు అవసరమైన వర్షాలు పడతాయా!?

9 Aug, 2018 17:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాలంలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి. మరో రెండు నెలల కాలం మిగిలి ఉంది. జూలై 31వ తేదీ వరకు దేశంలో సాధారణ వర్షపాతం 452.8 మిల్లీ మీటర్లు  పడాల్సి ఉండగా, 426.1 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే పడింది. అంటే, ఆరు శాతం వర్షపాతం తక్కువైంది. భారత వాతావరణ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం 1951–2000 సంవత్సరం వరకు అంటే యాభై ఏళ్లపాటు కురిసిన వర్షపాతం సరాసరి సగటును తీసుకొని దాన్నే సాధారణ వర్షపాతం అని లెక్కిస్తున్నారు. ఆ లెక్కన సాధారణ వర్షపాతం అంటే, దేశవ్యాప్తంగా 89 సెంటీ మీటర్లు వర్షపాతం పడడం. నైరుతి రుతుపవనాల సందర్భంగా జూన్‌ నుంచి నాలుగు నెలలపాటు కురిసిన వర్షపాతాన్నే పరిగణలోకి తీసుకొని సగటును లెక్కిస్తారు.

ఈ ఏడాది కూడా దేశంలో సాధారణ వర్షపాతం పడుతుందని వాతావరణ పరిశోధన సంస్థలు అంచనా వేయగా, ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువా, మరికొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ కురవడమే కాదు, వరదలు కూడా వచ్చాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో విచిత్రంగా ఓపక్క వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో పక్క వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొన్నది గుజరాత్‌లో. సౌరాష్ట్రలోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో జూలై 31వ తీదీవరకు సాధారణ వర్షపాతంకన్నా 128 శాతం ఎక్కువ వర్షం కురియగా, గాంధీనగర్‌ జిల్లాలో 64 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. కచ్‌ ప్రాంతంలో 74 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో జూలై మధ్యకాలంలో భయంకర వరదలు వచ్చాయి. వరదల కారణంగా గుజరాత్‌లో 52 మంది చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా అసాధారణ వర్షాలు పడడం వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పుల ఫలితమని గాంధీనగర్‌లోని ఐఐటీ ప్రొఫెసర్‌ విమల్‌ శర్మ చెప్పారు. వర్షాలు ఎక్కువ పడ్డాయా, తక్కువ పడ్డాయా? అన్నది ముఖ్యం కాదని, ఎప్పుడు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి? అన్నది ముఖ్యమని ఆయన అంటున్నారు.

ఈశాన్య ప్రాంతంలోని అస్సాం, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తక్కువ వర్షాలు పడగా, ఇప్పుడు ఎక్కువ వర్షాలతో వరదలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జూన్‌ నెలలో 20 శాతం తక్కువగా వర్షాలు కురియగా జూలై నెల నాటికి 29 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. వరదల కారణంగా ఈ రాష్ట్రంలో 49 మంది మరణించారు. ఈసారి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 537 మంది మరణించారు.

తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి
తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో జూలై 27 నుంచి వర్షాలు పడడం లేదు. మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ వర్షాభావ పరిస్థితులు ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొడివాతావరణ కొనసాగితే వర్షాలు పడవన్న అభిప్రాయం తప్పని, రుతుపవనాల సమయంలో వర్షాలకు అనువైన వాతావరణం, ఆ తర్వాత పొడివాతావరణం, మళ్లీ వర్షాలకు అనువైన వాతావరణ రావడం సహజమని భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ ఆర్‌ఆర్‌ ఖేల్కర్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ వర్షాలు ఎప్పుడు పడ్డాయన్నదే ముఖ్యమైన అంశమని, ఆగస్టు 23 వరకు పొడి వాతావరణం కొనసాగినట్లయితే పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌ పంటలు దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురవకపోతే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖరీఫ్‌ పంటకు బాగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు