పాకిస్థాన్ లో విమానాలు దించొద్దు!

7 Oct, 2016 08:28 IST|Sakshi
పాకిస్థాన్ లో విమానాలు దించొద్దు!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో తమ భూభాగంలోని గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల పైలట్లకు ఎయిర్ ఇండియా పలు జాగ్రత్తలు సూచించింది.

'పాకిస్థాన్ విమానాశ్రయాల్లో అత్యవసరంగా విమానం కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోండి. విమానంలో మంటలు వ్యాపించడం లాంటి తీవ్ర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. పాక్ లో విమానాన్ని దింపితే అదే మనకు చివరి గమ్యం కావొచ్చ'ని ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్కొందని సీనియర్ పైలట్ ఒకరు వెల్లడించారు. అయితే మౌఖికంగా మాత్రమే ఈ సూచనలు చేసిందని చెప్పారు.

గతంలోనూ ఇలాంటి సూచనలు చేసిందని సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. కాందహార్ హైజాకింగ్, 9/11, 26/11 దాడులు జరినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరమధ్య, తూర్పు ఇండియా నుంచి వెళ్లే విమానాలన్నీ పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అమెరికా, యూరోప్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమానాలు కూడా పాక్ మీదుగా మన దేశానికి వస్తుంటాయి.

మరిన్ని వార్తలు