పద్మ పురస్కారాల ప్రదానం

31 Mar, 2017 02:37 IST|Sakshi
పద్మ పురస్కారాల ప్రదానం

న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో గురువారం కనులపండువగా జరిగింది. రాజకీయ దిగ్గజాలు శరద్‌ పవార్, మురళీ మనోహర్‌ జోషీ, పీఏ సంగ్మా(మరణానంతరం), ఇస్రో మాజీ చైర్మన్‌ ఉడిపి రామచంద్ర రావులు పద్మవిభూషణ్‌.. బాలీవుడ్‌ గాయని అనురాధా పౌడ్వాల్‌సహా 39 మందికి రాష్ట్రపతి ప్రణబ్‌ పద్మ అవార్డుల్ని ప్రదానం చేశారు. ఈ ఏడాది 89 మందికి పద్మ అవార్డుల్ని గతంలోనే ప్రకటించారు. యోగా గురు స్వామి నిరంజనానంద సరస్వతీ, థాయ్‌లాండ్‌ యువరాణి మహాచక్రి సిరింద్రోన్, భారత్‌లో లాపరోస్కోపి పితామహుడు టెహెమ్టన్‌ ఉడ్‌వడియాలకు రాష్ట్రపతి పద్మభూషణ్‌ను బహూకరించారు.

తెలంగాణకు చెందిన పారిశ్రామిక వేత్త బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి , దరిపల్లి రామయ్యలకు పద్మశ్రీ అందుకున్నారు. ఇంజనీరింగ్‌ రంగంలో చేసిన పరిశోధనకు సైయెంట్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ బీవీఆర్‌కు పద్మశ్రీ వరించింది. ఆయన తెలంగాణలో 54 పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యలో శిక్షణ కల్పిస్తున్నారు. సామాజిక సేవ విభాగంలో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దరిపల్లి రామయ్య (వన రామయ్య) పచ్చదనాన్ని పరిరక్షించేందుకు ఎంతో కృషి చేశారు. బీవీర్, రామయ్యలతో పాటు లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ టీకే విశ్వనాథన్, ఫ్రాన్స్‌ చరిత్రకారుడు మైకెల్‌ డనినో, ఎంఐటీ మాజీ ప్రొఫెసర్‌ అనంత్‌ అగర్వాల్, జానపద  గాయని సుక్రీ బొమ్ము గౌడ, రచయిత నరేంద్ర కోహ్లీ, పారా అథ్లెట్‌ దీపా మాలిక్, నాటక రంగ కళాకారుడు వరెప్ప నబా తదితరులు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

>
మరిన్ని వార్తలు