‘మొదటి’ మహిళలకు నేడు పురస్కారాలు

20 Jan, 2018 00:51 IST|Sakshi

జాబితాలో సింధు, సానియా, మిథాలీ, గాయని చిత్ర

సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషి చేసి అరుదైన విజయాలు నమోదు చేసిన మహిళలను కేంద్రం పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా, వైద్య, ఆరోగ్య, రక్షణ, విమానయాన, పరిశ్రమ, సినీ రంగాల్లో సాధించిన విజయాలను గుర్తించి మొత్తం 112 మంది మహిళలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి భవన్‌లో శనివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా వీరంతా అవార్డులను అందుకోనున్నారు.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి మహిళ పీవీ సింధు, ప్రపంచ టెన్నిస్‌ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానం సాధించిన మొదటి భారత క్రీడాకారిణి సానియా మిర్జా, ప్రపంచ మహిళా క్రికెట్‌లో తొలిసారిగా 6000 పరుగులు పూర్తిచేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్, ఒలింపిక్‌ పతకం గెలిచిన మొదటి భారత వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరీ, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ (సీఐఐ) తొలి మహిళా అధ్యక్షురాలు, శోభన కామినేని, బ్రిటీష్‌ పార్లమెంటు ద్వారా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ గాయకురాలు కేఎస్‌ చిత్ర, హైదరాబాద్‌కు చెందిన తొలి మహిళా మ్యూజిక్‌ టెక్నీషియన్‌ సాజిదా ఖాన్‌ పురస్కారాలు అందుకోనున్నారు. 

మరిన్ని వార్తలు