‘అయోధ్య’ కేసు విచారణలో కొత్త ట్విస్ట్‌!

10 Jan, 2019 12:01 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు కీలకమైన మలుపు తీసుకుంది. కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ యు.యు లలిత్‌ తప్పుకున్నారు. గురువారం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన 14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జనవరి 29కి ధర్మాసనం వాయిదా వేసింది. అనంతరం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ లలిత్‌ వైదొలిగారు. జస్టిస్‌ లలిత్‌ గతంలో కల్యాణ్‌ సింగ్‌ తరుపున అయోధ్య కేసు వాదించారు.

కాగా న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్‌ ధావన్‌ అభ్యంతరం మేరకు జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. జస్టిస్‌ లలిత్‌ స్థానంలో మరొకరిని రాజ్యాంగ ధర్మాసనంలో చేర్చే వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది.

మరిన్ని వార్తలు