ఆగస్టులో రామాలయం పనులు

18 Jul, 2020 05:02 IST|Sakshi

నేటి ట్రస్ట్‌ సమావేశంలో ముహూర్తం ఖరారు

ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురికి ఆహ్వానం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ శనివారం అయోధ్యలో సమావేశమై ముహూర్తం ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా శుక్రవారం అయోధ్య చేరుకున్నారు. ఆగస్టులో ఆలయ పనుల ప్రారంభంపై ప్రధాని ఆమోదించిన తేదీని ఈ సమావేశంలో ఆయన ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కూడా అయిన మిశ్రా వెంట నిపుణులైన ఇంజనీరింగ్‌ అధికారుల బృందం కూడా వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారులు ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తారని సమాచారం.  వచ్చే నెలలో రామాలయ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హాజరయ్యే అవకాశాలున్నాయి.

ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ తెలిపారు. ‘ఆలయ భూమి పూజ ఆన్‌లైన్‌ ద్వారా గానీ లేదా ఇతర వర్చువల్‌ విధానాల్లో గానీ ప్రారంభించాలని సాధువులు కోరుకోవడం లేదు. ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని వారు భావిస్తున్నారు. నా ఆహ్వానాన్ని ప్రధాని ఆమోదిస్తారనే నమ్మకం ఉంది’అని గోపాల్‌ దాస్‌ అన్నారు.  ఆగస్టులో ప్రధాని మోదీ అయోధ్య సందర్శనపై పీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. 

మరిన్ని వార్తలు