సరిహద్దు ఉద్రిక్తత: రామ మందిర నిర్మాణం వాయిదా!

19 Jun, 2020 14:20 IST|Sakshi

లక్నో: గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా ఘాతుకాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్‌ దుశ్చర్య కారణంగా అమరులైన సైనికుల త్యాగాన్ని కీర్తిస్తూ దేశ ప్రజలు వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో హిందూ సంస్థలు(హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్‌) చైనా తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా చైనా జెండా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టి బొమ్మలు, చైనా ఉత్పత్తులను దహనం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పిస్తూ... అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి మద్దతుగా నిలబడేందుకు ఈ  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం)

ఈ విషయం గురించి ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ.. దేశ పరిస్థితులకు అనుగుణంగా మందిర నిర్మాణ ప్రారంభ ప్రక్రియ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిరానికి జూన్‌10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్‌ అధికార ప్రతినిధి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో రామజన్మభూమిలో న్యాయస్థానం కేటాయించిన స్థలంలోని కుబేర్‌ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కాగా సోమవారం నాటి ఘటనలో 20 భారత సైనికులు అమరులైన నేపథ్యంలో నిర్మాణాన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.(చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ)

మరిన్ని వార్తలు