మూడు అంతస్తులుగా అయోధ్య రామ మందిర నిర్మాణం

22 Jul, 2020 14:41 IST|Sakshi

10 ఎకరాల్లో మందిరం.. 57 ఎకరాల్లో రామ్‌ కాంప్లెక్స్‌

నక్షత్ర శాల, మ్యూజియం, శేషవతార్‌ నిర్మాణం

భూమి పూజకు త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం భూమి పూజ ఆగస్టు 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో మందిరంలో మూడు అంతుస్తులు ఉండనున్నట్లు సమాచారం. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లుగా నిర్మాణం జరగనుంది. ప్రతిపాదిత రామమందిరాన్ని 10 ఎకరాల స్థలంలో నిర్మిస్తుండగా.. మిగిలిన 57 ఎకరాలను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న  శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఆలయ సముదాయంలో నక్షత్ర వాటిక కూడా నిర్మించనున్నారు. ఒక్కొ నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 27 మొక్కలను నాటనున్నారు. నక్షత్ర వాటిక ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనాలు తమ పుట్టిన రోజునాడు వారి జన్మ నక్షత్రం ప్రకారం ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం ఉండనుంది.

ఇనుము లేకుండా నిర్మాణం
ఆలయ పునాది 15 అడుగుల లోతులో ఉంటుంది. ఇది 8 పొరలను కలిగి ఉంటుంది. ప్రతి పొర 2 అడుగుల వెడల్పు ఉంటుంది. పునాది వేదికను సిద్ధం చేయడానికి కాంక్రీట్‌, మోరాంగ్‌ను వాడనున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించడం లేదు. అంతేకాక వాల్మీకి రామాయణంలో పేర్కొన్న చెట్లను రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో నాటనున్నారు. ఈ ప్రాంతానికి వాల్మీకి రామాయణానికి అనుగుణంగా పేరు పెడతారు. మందిరం భూమి పూజ తర్వాత రామ్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో శేషవతార్‌ ఆలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ట్రస్ట్‌ ప్రతిపాదించింది. మందిర నిర్మాణం ముగిసిన తర్వాత శేషవతార్‌ శాశ్వత నిర్మణాన్ని చేపడతారు. రాముడి పుట్టుక నుంచి అవతారం ముగిసేవరకు జరిగిన పలు అంశాలతో ‘రామ్‌ కథా కుంజ్‌ పార్క్’‌ నిర్మాణం కూడా జరగనుంది. అలానే మందిరం తవ్వకాలలో లభించిన అవశేషాలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటు గోశాల, ధర్మశాల, ఇతర దేవాలయాల సముదాయాలు కూడా ఇక్కడ నిర్మిస్తారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక)

మందిరం ఎత్తు మరో 20 అడుగులు పెంపు
మందిరం భూమి పూజ కోసం రాగి పలకను సిద్ధం చేస్తున్నారు. దీని మీద ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనగా ఆలయం పేరు, ప్రదేశం, సమయం ఈ పలకపై సంస్కృతంలో చెక్కుతారు. 1988లో ప్రతిపాదించిన అయోధ్య రామ మందిర నిర్మాణం ఎత్తు 161 అడుగులు. అయితే ప్రస్తుతం దాన్ని మరో 20 అడుగులు పెంచినట్లు ఆలయ ప్రధాన వాస్తు శిల్పి సి సోంపురా కుమారుడు నిఖిల్‌ సోంపురా తెలిపారు. ఆగస్టు 5న జరగనున్న మందిర భూమి పూజ కోసం గంగా, యమున, సరస్వతి నదులు సంగమ క్షేత్రం అయిన త్రివేణి సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సూచించింది. రామ్‌ మందిర్‌ ఉద్యమంలో  ప్రయాగ్‌రాజ్‌‌కు చెందిన పలువురు సాధువులు ప్రముఖ పాత్ర పోషించినందున.. అయోధ్యలో భూమి పూజ జరిగే రోజున వివిధ మఠాలు, దేవాలయాల్లో వేడుకలు జరుగుతాయని వీహెచ్‌పీ ప్రతినిధి అశ్వని మిశ్రా తెలిపారు. (మందిర నిర్మాణంపై పవార్‌ కీలక వ్యాఖ్యలు)

భూమి పూజ నాడు దీపాలు వెలిగించాలి
ఆగస్టు 5 న సాయంత్రం తమ ఇళ్ల వద్ద దీపాలు‌ వెలిగించాలని వీహెచ్‌పీ హిందువులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ సందర్భంగా వీక్షకులు, సాధువులు శంఖం పూరిస్తా​రని అశ్వని మిశ్రా తెలిపారు. ఆగస్టు 5న ఆలయానికి పునాదిరాయి వేయాలని ట్రస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించింది.

మరిన్ని వార్తలు