న్యాయ పీఠంపై... ఆ ఐదుగురూ!!

10 Nov, 2019 02:37 IST|Sakshi
అయోధ్య తీర్పు చెప్పాక గ్రూప్‌ ఫొటో దిగిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌

అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఐదుగురు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దీనికి సారథ్యం వహించగా... జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ ఈ తీర్పును వెలువరించారు. వ్యవహారాన్ని ఒక స్థల వివాదంలా చూసిన ధర్మాసనం... స్థలం ఎవరికి చెందుతుందనే తీర్పునిచ్చింది. తీర్పుపై ఐదుగురూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేయగా... ఒక జడ్జి మాత్రం... ఆ స్థలం శ్రీరాముడి జన్మస్థానమనే హిందువుల విశ్వాసానికి, నమ్మకానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొనటం గమనార్హం. ఈ ఐదుగురి వివరాలూ చూస్తే...

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌
ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌... 1954 నవంబర్‌ 18వ తేదీన జన్మించారు. 1978లో గౌహతి బార్‌ కౌన్సిల్‌లో చేరి గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2001లో గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011లో పంజాబ్‌–హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2012లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2018లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు.  

జస్టిస్‌ శరత్‌ అరవింద్‌ బాబ్డే
రాజ్యాంగ ధర్మాసనంలో రెండో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే. 1978లో మహారాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేరిన ఈయన... బోంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో పని చేశారు. బోంబే హైకోర్టులోనే దాదాపు 21 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో సీనియర్‌ న్యాయవాది అయ్యారు. 2000లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యలు చేపడతారు. 2021 ఏప్రిల్‌ వరకూ ఈ పదవిలో కొనసాగుతారు.

జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్‌
జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ బోంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. 1998లో సీనియర్‌ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 1998 నుంచి దాదాపు రెండేళ్లపాటు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా కూడా వ్యవహరించారు. 2000లో బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా... 2013లో అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టుకు వచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఉపన్యాసాలిచ్చారు.  

జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ జాన్‌పూర్‌లో జన్మించారు. అలహాబాద్‌ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన అశోక్‌ భూషణ్‌... 1979లో యూ పీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడయ్యారు. అలహాబాద్‌ హైకోర్టులో వివిధ పోస్టులలో పనిచేసిన అశోక్‌ భూషణ్‌ 2001లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా, 2015లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు  

జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
అయోధ్య కేసు ధర్మాసనంలో ఉన్న ఏకైక ముస్లిం జడ్జి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌. కర్ణాటకలోని కోస్తా ప్రాంతం బెళువాయికి చెందిన ఈయన 1983లో కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004లో శాశ్వత జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకుండానే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన వారిలో ఈయన మూడో వ్యక్తి కావడం గమనార్హం. ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హంగా ప్రకటించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ నజీర్‌ అప్పట్లో ఆ తీర్పును వ్యతిరేకించారు.

మరిన్ని వార్తలు