అయోధ్య తీర్పు : నేషనల్‌ హెరాల్డ్‌ వివాదాస్పద ఎడిటోరియల్‌

11 Nov, 2019 11:01 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ క్షమాపణలు చెప్పింది. అయోధ్య వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కించపరుస్తూ ఆ పత్రిక ఎడిటోరియల్‌ ప్రచురించడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘అయోధ్యలో హిందువులు ఎప్పటికీ పూజలు చేయలేరు’ అనే టైటిల్‌తో నేషనల్‌ హెరాల్డ్‌ ఎడిటోరియల్‌ ప్రచురించింది. దాంతోపాటు 1992 నాటి అయోధ్య, 2019 లో సుప్రీంకోర్టుగా అవతరించిందని చూపుతూ కార్టూన్‌ కూడా వేసింది. ‘బెత్తం ఎవరి చేతిలో ఉంటే వారిదే ఎద్దు’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ‘ఒత్తిడి.. హింస.. రక్తపాతంతో నిర్మించిన గుడిలో దేవుడు ఉంటాడా..? అలాంటి చోట ఎవరైనా పూజలు చేయగలరా..? అని క్యాప్షన్‌ కూడా పెట్టింది. 

ఈ వివాదాస్పద ఎడిటోరియల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది పక్కా పాకిస్తాన్‌ నిధులతో నడిచే పత్రిక అని కామెంట్లు చేశారు. అపెక్స్‌ కోర్టు తీర్పును అవమాని పరిచిన నేషనల్‌ హెరాల్డ్‌ యాజమాన్యం శిక్షించాలని కొందరు వ్యాఖ్యానించారు. దీంతో దిగొచ్చిన పత్రికా యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించాలని పేర్కొంటూ ఓ ఆర్టికల్‌ ప్రచురించింది. వివాదాస్పద ఆర్టికల్‌కు సంబంధించిన ఉద్దేశాలు ఆ రచయిత వ్యక్తిగతమని వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గదని చెప్తూనే.. తన పత్రికలో కాంగ్రెస్‌ అక్కసు వెళ్లగక్కిందని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాలు తెలుస్తూనే ఉన్నాయని ఎద్దేవా చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ను భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1938లో స్థాపించారు.

మరిన్ని వార్తలు