కోళ్లు, మేకలు చోరీ చేశానట..

16 Oct, 2019 08:58 IST|Sakshi

లక్నో : ప్రజల కోసం​ పనిచేయడమే తాను చేసిన నేరమని సీనియర్‌ ఎస్పీ నేత ఆజం ఖాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తనపై లేనిపోని కేసులు మోపి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు తనపై కోళ్లు, మేకలు దొంగిలించిన అభియోగాలు మోపారని ఆయన మండిపడ్డారు. రాంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్‌ కేంద్ర, యూపీ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘నాపై హత్యా యత్నం అభియోగాలు మోపారు. ఇప్పుడు కోళ్లు, మేకలు దొంగిలించిన ఆరోపణలు సైతం నాపై ఉన్నా’ యని చెప్పుకొచ్చారు.

రాంపూర్‌ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేయడం వల్లే తాను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజం ఖాన్‌ ప్రస్తుతం భూ ఆక్రమణలకు సంబంధించి క్రిమనల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ ఎదుట ఆయన ఈనెల 5న హాజరయ్యారు. ఆజం ఖాన్‌పై మొత్తం 80 కేసులు నమోదవడం​ గమనార్హం. కాగా ఆజం ఖాన్‌ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది పార్లమెంట్‌కు ఎన్నికవడంతో రాంపూర్‌ అసెంబ్లీ స్ధానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాంపూర్‌ నుంచి ఆయన భార్య తజీన్‌ ఫాతిమాను ఎస్పీ బరిలో నిలిపింది.

మరిన్ని వార్తలు