22 కిలోల బరువు తగ్గాను : ఆజంఖాన్‌

13 Oct, 2019 16:10 IST|Sakshi

రాంపూర్‌ : తనపై అక్రమంగా నమోదైన క్రిమినల్‌ కేసుల కారణంగా 22 కిలోల బరువు తగ్గినట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున ఆజంఖాన్‌ భార్య ఫాతిమా బరిలో నిలిచారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆజంఖాన్‌ తన ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. తాను ఎదుర్కొంటున్న కేసుల గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తను ప్రజల కోసం, సమాజం కోసం మాత్రమే పనిచేశానని తెలిపారు. ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు తనపై క్రిమినల్‌ అని ముద్ర వేశారని విమర్శించారు. 

జీవితంలో చాలా చూశానని చెప్పిన ఆజంఖాన్‌.. ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదని అన్నారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, పిల్లల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కిలో బరువు పెరగలేదని.. కానీ 22 కిలోలు తగ్గానని వ్యాఖ్యానించారు. కాగా, ఆజంఖాన్‌పై ల్యాండ్‌ మాఫియాకు సంబంధించి పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అక్టోబర్‌ 5వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆజంఖాన్‌ను 2.30 గంటల పాటు విచారించింది. ఈ కేసుల తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్‌ 29కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు