‘బాహుబలి 3’.. హీరో ఎవరంటే

31 Aug, 2018 11:50 IST|Sakshi

భోపాల్‌ : ‘జక్కన్న’ చెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి - ది కంక్లూజన్‌’ రెండూ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యయనాలను లిఖించాయి. దాదాపు ఆరేళ్ల పాటు శ్రమించి రెండు పార్టులుగా తీసిన ఈ చిత్రం కలెక్షన్ల వసూళ్లలో కొత్త రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్‌ చేయడానికి ‘బాహుబలి - 3’ తెర మీదకొస్తుంది. అదేంటి ‘బాహుబలి - ది కంక్లూజన్‌’తోనే ఆ కథ అయిపోయింది కదా.. ఇప్పుడు మూడో పార్ట్‌లో ఏం చెప్తారు.. ఈ మూడో పార్ట్‌ని తీసేది కూడా రాజమౌళియేనా.. ఇందులో కూడా ప్రభాస్‌, రానాలే ఉంటారా.. అయినా అసలు దీని గురించి ఇంత వరకూ ఎక్కడ, ఎవరు, ఏమి చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నారా..?

అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మేం చెప్తున్నది రాజమౌళి ‘బాహుబలి’ గురించి కాదు. ఈ ‘బాహుబలి 3’కి, రాజమౌళి ‘బాహుబలి’కి సంబంధమే లేదు. ఈ ‘బాహుబలి’ని తీసింది వివారాలు తెలియని ఒక నెటిజన్‌. మరికొద్ది నెలల్లో మధ్యప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా లోక్‌ సభ, శాసన సభ ఎన్నికల నగారా మోగనున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ నెటిజన్‌ ‘బాహుబలి’ సినిమాకు స్పూఫ్‌గా ‘బాహుబలి 3’ అనే వీడియోను రూపొందించి ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహూల్‌ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రధాన పాత్రదారులు.

వీరిలో  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ‘బాహుబలి’గా, జ్యోతిరాధిత్య సింధియా ‘బల్లాల దేవుని’గా, సోనియా గాంధీని ప్రభాస్‌ పెంచిన తల్లి పాత్రలో నటించిన రోహిణిగా డిజైన్‌ చేశారు. బాహుబలికి, బల్లాల దేవునికి మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌తో పాటు.. బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌కే హైలెట్‌గా నిలిచిన  ప్రభాస్‌ శివలింగాన్ని మోసే సీన్‌ని కూడా మార్ఫ్‌ చేశారు. ఈ సీన్‌లో ప్రభాస్‌ పాత్రలో శివరాజ్‌ సింగ్‌ని మార్ఫ్‌ చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.

మరిన్ని వార్తలు