బిడ్డల తారుమారు.. తల్లుల కన్నీరు 

17 Nov, 2019 10:29 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

వారం రోజుల పసికూనలకు డీఎన్‌ఏ పరీక్ష

తమిళనాడులోని భెల్‌ ఆస్పత్రిలో చిత్రమైన ఘటన 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లులమైనందుకు సంబరపడాలో, బిడ్డలు తారుమారైనట్లు చెలరేగిన వివాదంతో దిగాలుపడాలో తెలియని పరిస్థితి వారిది. కేవలం వారం రోజుల క్రితమే పురుడుపోసుకున్న తల్లులు తారుమారైనట్లు చెప్పబడుతున్న తమ బిడ్డలతో తంటాలు పడుతున్న చిత్రమైన ఉదంతం తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుచ్చిరాపల్లి జిల్లాలోని భెల్‌ బాయిలర్‌ కర్మాగారంలో పనిచేసే కార్మికుల కోసం ప్రాంగణంలోనే ఒక ఆస్పత్రి ఉంది. భెల్‌ ఉద్యోగి వినోద్‌ భార్య అఖిల ఈనెల 11న మగబిడ్డకు జన్మనిచ్చింది. అఖిల తన బిడ్డతో ఆస్పత్రి ప్రసవహాలు 8వ నంబరు మంచంపై ఉండేవారు. అలాగే బాలకుమార్‌ అనే మరో ఉద్యోగి భార్య సంగీత సైతం ఈనెల 12న మగబిడ్డను ప్రసవించింది. సంగీతకు అదే హాలులో 12వ నంబరు మంచాన్ని కేటాయించారు. శుక్రవారం ఉదయం తల్లులిద్దరూ నిద్రపోతుండగా ఆస్పత్రి సిబ్బంది వారిద్దరి బిడ్డలను స్నానం చేయించేందుకు తీసుకెళ్లి మరలా అవే మంచాలపై పడుకొబెట్టి వెళ్లిపోయారు. 

నిద్రనుంచి మేల్కొన్న తల్లులు తమ బిడ్డలకు చనుబాలు ఇవ్వబోగా అఖిల పక్కన పడుకుని ఉన్న బిడ్డ పాలుతాగలేదు. దీంతో అనుమానం వచ్చిన అఖిల ఇది తన బిడ్డ కాదని కేకలు వేస్తూ బిడ్డ మారిపోయిందని బిగ్గరగా రోదించింది. తనకు జన్మించిన బిడ్డ సంగీత వద్ద ఉందని ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు. అయితే సంగీత ఆమె ఆరోపణలను ఖండిస్తూ ఇది తన బిడ్డేనని వాదించారు. ఈ వివాదం ముదరడంతో ఆస్పత్రి ప్రధానవైద్యులు, భెల్‌ బాయిలర్‌ కర్మాగారం ప్రధానాధికారి విచారణ జరిపారు. ఇద్దరి బిడ్డల రక్తాన్ని, బరువును పరిశీలించారు. అయితే ఇద్దరు బిడ్డల రక్తం ఓ పాజిటివ్, 2.95 కిలోల బరువు సమానంగా ఉండడంతో మరింత చిక్కు సమస్యగా మారింది. ఇలా లాభం లేదనుకుని డీఎన్‌ఏ పరీక్ష చేయించి ఎవరి బిడ్డలో తేల్చాలని నిర్ణయించారు. ఇద్దరు బిడ్డల బొడ్డుతాడు, రక్తం నమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపారు.  ఫలితాలు రావడానికి మూడువారాలు పడుతుందని, ఆ తరువాతనే ఎవరి బిడ్డ ఎవరో తేలుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు