‘కూర్చుంటావా లేదా కాళ్లు విరగ్గొట్టాలా..?’

19 Sep, 2018 11:01 IST|Sakshi
కార్యక్రమానికి హాజరైన దివ్యాంగున్ని హెచ్చరిస్తోన్న బీజేపీ మంత్రి బాబుల్‌ సుప్రియో

కోల్‌కతా : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో మరోసారి నోరు జారారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాబుల్‌ ‘మీ కాళ్లు విరగొట్టాలా’ అంటూ అక్కడికి వచ్చిన వారిని బెదిరించాడు. వివరాల ప్రకారం.. అసన్సోల్‌లో దివ్యాంగులకు వీల్‌ చైర్లు, ఇతర పరికారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుల్‌ సుప్రీయో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు.

ఈ సమయంలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ సభ నిర్వాహకుడు అతన్ని అడ్డగించి కూర్చోవాల్సిందిగా కోరాడు. దీన్ని గమనించిన బాబుల్‌ తన ప్రసంగాన్ని ఆపి.. సదరు వ్యక్తితో ‘నీ సమస్య ఏంటీ.. ఎక్కడికి వెళ్తున్నావ్‌.. కూర్చో, లేదంటే నీ కాళ్లు విరగొట్టి స్ట్రెచర్‌ మీద పడుకోబెడతాను. నేను ఒక్క మాట చెబితే సెక్యూరిటీ వాళ్లు నీకు తగిన శాస్తి చేస్తారం’టూ సదరు దివ్యాంగున్ని హెచ్చరించారు. దివ్యాంగులు కార్యక్రమానికి వచ్చిన మంత్రి వారినే ఇలా బెదిరించడంతో అక్కడున్న వారు విస్తు పోయారు.

అయితే బాబుల్‌ ఇలా దురుసుగా మాట్లాడటం ఇదే ప్రథమం కాదు. ఈ ఏడాది మార్చిలో శ్రీరామ నవమి ఏర్పాట్లలో భాగంగా అల్లర్లు చెలరేగాయి. అసన్సోలో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన బాబుల్‌ సుప్రియో చుట్టూ జనాలు గుమికూడారు. దాంతో సుప్రియో వారి మీద చిరాకు పడుతూ ‘నేను తల్చుకుంటే బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను’ అంటూ వారిపై మండి పడ్డారు

మరిన్ని వార్తలు