అర్థరాత్రి కారడవిలో 11 నెలల పాప ఒంటరిపోరాటం.. వైరల్‌

10 Sep, 2019 15:47 IST|Sakshi

పాలుతాగే శిశువు తన ప్రాణాలు కాపాడుకోవాలనీ చేసిన పోరాటం.. నమ్మశక్యం కాని నిజం!

పుట్టిన ప్రతిజీవీ బతకడం కోసం పోరాటం చేస్తుంది. మనిషి కూడా అంతే.. చివరికి పాలుతాగే శిశువు కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలనీ.. అపాయం నుంచి బయటపడాలనీ చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతుంది. నమ్మబుద్ధి కావడం లేదా..? కేరళలో 11 నెలల శిశువు అర్థరాత్రి సమయంలో కారడవిలో ఒంటరిగా తనను తాను బతికించుకోవడం కోసం చేసిన ప్రయత్నం చూస్తే ప్రతి జీవీ బతికేందుకు చేసే ప్రయత్నం అర్థమవుతుంది.

రాత్రి 10 గంటల సమయంలో ఎస్‌యూవీ వాహనం నుంచి 11 నెలల పసికందు కిందికి జారిపడిపోయింది. ఇలా పాప పడ్డ స్థలం ఏ పట్టణమో.. గ్రామమో కాదు.. కారడవి. ఏనుగులు సహా అనేక క్రూర జంతువులు సంచరించే ప్రాంతం ఇది. కానీ ఈ పసికందు.. కిందపడ్డ వెంటనే ఏం చేసిందో చూడండి. తల్లిఒడిలో నుంచి కింద పడిపోయినట్లు ఆ పసిమెదడుకు ఎలా తెలిసిందో.. చుట్టూ కళ్లుపొడుచుకున్న కనిపించని చీకటిలో తనను తాను ఎలా రక్షించుకునేందుకు ఎలా అన్వేషించిందో ఈ సీసీటీవీ ఫుటేజీ మనకు చూపుతోంది. కింద పడ్డ పాప చుట్టూ చూసింది.. దూరంగా చెక్ పోస్ట్ వద్ద నుంచి వెలుతురు ఆ చిట్టికళ్లకు కనిపించింది. అంతే.. వెలుతురు ఉంటే మనుషులు ఉంటారనుకుందేమో.. తనను రక్షిస్తారని భావించిందేమో.. ఆ పసిబిడ్డ పాకుతూ పాకుతూ ఆ వెలుతురు వైపుగా వెళ్లింది. చెక్ పోస్ట్ వద్ద కాపలాగా ఉన్న అటవీశాఖ సిబ్బంది.. పసికందును రక్షించారు.

పసిపాప కారడవిలో పడిపోయినా.. ఆమె తల్లిదండ్రులు 40 కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయారు. అప్పుడు మెలుకువ వచ్చి పాప పడిపోయిందని గుర్తించి పోలీసులకు తెలిపారు. ఇంతలో పాపను అటవీశాఖ సిబ్బంది దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ముఖం మొత్తం కొట్టుకుపోయి ఉంది. రక్తం కారుతున్న పాపకు డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ చిట్టితల్లి పేరు రోహిత.. ఈ సంఘటన జరిగింది కేరళ రాష్ట్రంలోని రాజమల ప్రాంతంలో.. ప్రస్తుతం పాప తల్లిదండ్రుల వద్ద హాయిగా ఉంది.

ఈ సంఘటన మానవజీవన పరిణామక్రమంలోని ప్రాథమిక దశను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మనిషి పుట్టుక ఈ ప్రపంచంలో ఎలా జరిగిందో కోతి నుంచి మనిషిగా మారినప్పుడో.. లేదా ఓ శిశువుగా మనిషి తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు జీవికను కొనసాగించడం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని.. అర్థం చేసుకుంటూ ఈ పసికందులాగే పోరాడి ఉంటాడు. అర్థరాత్రి వేళ ఈ 11 నెలల చిట్టితల్లి తన తెలివితేటలను ఎలా ఉపయోగించి తనను తాను అడవిలోని జంతువుల నుంచి.. రోడ్డుపై వెళ్లే వాహనాల నుంచి ఎలా కాపాడుకుందో.. తొలి మానవుడు కూడా అలాగే పోరాడి ఉంటాడు. అందుకే.. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మన బతుకే. పుట్టినపుట్టుకను కడదాకా కొనసాగించడం.. ఆ కొనసాగించడం కోసం చేసే జీవన పోరాటమే ఇప్పుడు ఆవిష్కృతమైన నేటి సమాజం.

చూడండి.. అర్ధరాత్రి రోడ్డు మీద పాప.. వైరల్‌ వీడియో

చదవండి: రాత్రిపూట రోడ్డుపై అంబాడుతూ పాప.. వైరల్‌ వీడియో

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా