కేరళ వరదలు : విరాళాన్ని పెంచిన బజాజ్‌ ఆటో

21 Aug, 2018 18:48 IST|Sakshi

న్యూఢిల్లీ : కేరళ బాధితుల దయనీయమైన పరిస్థితిని చూసి, ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే విరాళాలు ప్రకటించిన కంపెనీలు కూడా.. మరింత సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో, కేరళకు మరో రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ పలు బజాజ్‌ ట్రస్ట్‌ల ద్వారా రూ.50 లక్షల రూపాయలను కేరళకు అందించింది. తాజాగా ప్రకటించిన రెండు కోట్ల రూపాయలలో ఒక కోటిని నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధిలో క్రెడిట్‌ చేయనున్నట్టు పేర్కొంది. మరో కోటి రూపాయలను జానకిదేవి బజాజ్‌ గ్రామ్‌ వికాస్‌ సంస్థ(జేబీజీవీఎస్‌) ద్వారా సర్వైవల్‌ కిట్స్‌ సరఫరాకు ఉపయోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. 

జేబీజీవీఎస్‌.. బజాజ్‌ ఆటో తరుఫున పలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ. వరదల్లో ప్రభావితమైన ప్రాంతాల్లో బేసిక్‌ స్టార్టప్‌ కిట్‌ ద్వారా సుమారు 1000 కుటుంబాలకు సహాయం అందించనుంది. రాష్ట్రంలో ఉన్న డీలర్‌షిప్‌ల ద్వారా కేరళకు తామిచ్చే సపోర్టును మరింత పెంచుతామని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌(ఇంట్రా-సిటీ బిజినెస్‌) ఆర్‌సీ మహేశ్వరి తెలిపారు. బజాజ్‌ ఆటో అందిస్తున్న సర్వైవల్‌ కిట్‌లో వాటర్‌ ఫిల్టర్‌, బేసిక్‌ ఐటమ్స్‌తో కిచెన్‌ సెట్‌, ప్లాస్టిక్‌ స్లీపింగ్‌ మ్యాట్స్‌, బ్లాంకెట్లు, టవల్స్‌ వంటివి ఉండనున్నాయి. ఈ కిట్స్‌ను బజాజ్‌ ఆటో కమర్షియల్‌ వెహికిల్‌ డీలర్‌షిప్‌లు, సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్న ఎన్‌జీవోల ద్వారా సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర ఆటోమొబైల్‌ సంస్థలు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలు రెండు కోటి చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాయి. టాటా మోటార్స్‌, నిస్సాన్‌ ఇండియా, బీఎండబ్ల్యూలు కస్టమర్లకు సర్వీస్‌ సపోర్టు ఇస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు