6న బక్రీద్!

2 Oct, 2014 01:24 IST|Sakshi
6న బక్రీద్!

- సెలవు ప్రకటించిన ప్రభుత్వం
- ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజుల సెలవు

సాక్షి, చెన్నై : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ఈనెల ఆరో తేదీ జరుపుకోనున్నారు. ఆ రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజు లు సెలవు దొరికినట్టు అయింది. భక్తి భావాన్ని చాటే రంజాన్ పండుగ అనంతరం ముస్లింలకు మరో ముఖ్య పండుగ బక్రీద్. త్యాగ నిరతిని చాటే ఈ పండుగను ఈదుల్ జుహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తుంటారు. ఈ పండుగ వెనుక త్యాగాన్ని చాటే కథ ఉంది. దుల్హాజ్  మాసంలో పదో తేదీని బక్రీద్ పర్వదినంగా జరుపుకుంటారు.

ఈ ఏడాది బక్రీద్ పర్వదినం అక్టోబరు ఐదో తేదీగా క్యాలెండర్లలో ప్రకటించారు.  ఆ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటన విడుదలయ్యింది. ఎటూ ఐదో తేదీ ఆదివారం కావడంతో సెలవు ఇచ్చినా ఒకటే.. ఇవ్వకున్నా ఒక్కటే. నెల వంక కనిపించగానే, దుల్హజ్ మాసం ఆరంభమైనట్టుగా ముస్లింలు భావిస్తారు. ఆ మేరకు ఈ నెల 25న ఆకాశంలో నెల వంక కన్పించిన దాఖలాలు లేవు. దీంతో క్యాలెండర్లలో పేర్కొన్న తేదీలో మార్పు అనివార్యం అయింది. ఆ రోజున కాకుండా మరుసటి రోజున కనిపించడంతో పండుగను సోమవారం జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
కనిపించని నెలవంక
ఆకాశంలో నెలవంక కన్పించని దృష్ట్యా, పండుగను ఆరో తేదీ జరుపుకునే విధంగా ప్రధాన హాజీ ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. ప్రభుత్వ సెలవు దినాన్ని సోమవారానికి మార్చాలని సూచించారు. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్ ఆరోతేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం బక్రీద్ పర్వదినంగా ప్రకటన విడుదల చేస్తూ, ఆ రోజును రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా పేర్కొన్నారు. సోమవారం సెలవు దినం ప్రకటించడంతో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు విరామం లభించినట్టు అయింది. గురువారం ఆయుధ పూజ, శుక్రవారం విజయ దశమి సెలవు దినాలు కాగా, శని, ఆదివారాలు ఎలాగో సెలవు రోజులు కావడం విశేషం.

మరిన్ని వార్తలు