బాలాకోట్‌ ఉగ్రశిబిరం మొదలైంది

24 Sep, 2019 04:26 IST|Sakshi
చెన్నైలో మాట్లాడుతున్న ఆర్మీ చీఫ్‌ రావత్‌

భారత వాయుసేన దాడుల తర్వాత తాజాగా ప్రారంభించిన పాక్‌

500 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నాలు!

వెల్లడించిన భారత ఆర్మీ చీఫ్‌ రావత్‌

చెన్నై: బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్‌ చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో వెల్లడించారు. పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో «ధ్వంసమైన బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్‌ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుల్వామాలో భారత సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి 40 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఆయన గుర్తుచేశారు.

ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్‌ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని తెలిపారు. తిరిగి మళ్ళీ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని ఆయన వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాం తాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు.

కశ్మీర్‌ లోయలో ఏదో జరుగుతోందని కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్నామనీ, ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోందనీ ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన సైన్యం ఉగ్రవాదులను చొరబాట్లను తీవ్రంగా అడ్డుకుంటోందనీ అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బిపిన్‌ రావత్‌ ఆరోపించారు. కాగా, కథువా జిల్లాలో 40 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌
జమ్ము: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల హత్య సహా నాలుగు ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. కిష్త్వార్‌ జిల్లాకు చెందిన నిస్సార్‌ అహ్మద్‌ షేక్, నిషాద్‌ అహ్మద్, ఆజాద్‌ హుస్సేన్‌లు కలిసి బీజేపీ నేత అనిల్‌ పరిహార్, ఆయన సోదరుడు అజిత్‌ పరిహార్‌లను గత ఏడాది కాల్చి చంపారు. ఏప్రిల్‌ 9వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత చందర్‌కాంత్‌ శర్మ, ఆయన అంగరక్షకుడిని కాల్చి చంపారని జమ్మూ జోన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ముకేశ్‌ సింగ్‌ వెల్లడించారు.

హింసాత్మక ఘటనలకు పాల్పడిన అనంతరం వీరంతా షేక్‌ హుస్సేన్‌ ఇంట్లో తలదాచుకునే వారని ముకేశ్‌ వెల్లడించారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను అడ్డుకునేందుకు భారత రక్షణ బలగాలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం భారత్‌లోని కీలకమైన నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్మీని బలగాలను అలర్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా