‘చిన్నారి పెళ్లి కూతురు’ ఆత్మహత్య!

2 Apr, 2016 02:36 IST|Sakshi
‘చిన్నారి పెళ్లి కూతురు’ ఆత్మహత్య!

ఆనంది ఫేం ప్రత్యూష అనుమానాస్పద మృతి
 
 ముంబై: డబ్బింగ్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’లో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకూ చిరపరిచితురాలైన ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ(24) శుక్రవారం మరణించారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో సీలింగ్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించిందని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. అయితే, సూసైడ్ నోట్ ఏదీ అక్కడ లభించలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగి ఉండొచ్చని, మరణానికి కచ్చితమైన కారణం పోస్ట్‌మార్టం అనంతరమే తెలుస్తుందని స్పష్టం చేశారు.

టీవీ ప్రొడ్యూసర్ అయిన బాయ్‌ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్‌తో అనుబంధానికి సంబంధించి ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. చివరి వాట్సాప్ సందేశంలోనూ.. ‘మరణం తరువాత కూడా నీ నుంచి ముఖం తిప్పడంలేదు’ అని ఒక స్మైలీతో పాటు ఉంది. ప్రత్యూష మరణానికి కారణాలు తెలియవని చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)లో ఆమె సహనటుడు సిద్ధార్థ్ శుక్లా తెలిపారు. ‘బిగ్ బాస్ 7’, ‘జలక్ దిఖ్‌లాజా’ తదితర టీవీ షోల్లోనూ ఆమె పాల్గొన్నారు. ప్రత్యూష మృతిపై సహనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు ఆమె మృతి ఆత్మాహత్య కాదేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్నారి పెళ్లి కూతురులో చిన్నప్పటి ఆనంది పాత్రను అవికా గోర్ పోషించగా, అనంతరం యుక్త వయస్సు ఆనందిగా ప్రత్యూష నటించారు. 2013లో ప్రత్యూష స్థానంలో తోరల్ రసపుత్రాను ఆ పాత్ర కోసం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు