ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు

1 Nov, 2017 15:14 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దోషులుగా తేలిన రాజకీయ నేతలను తమ జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) బుధవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. దోషులపై జీవితకాల నిషేధం అమలైతే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌, ఏఐఏడీఎంకే నేత వీకే శశికళ వంటి నేతలకు చుక్కెదురవుతుంది. ప్రస్తుత చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష ఎదుర్కొనే రాజకీయ నేతలు విడుదలైనప్పటి నుంచి ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు.

దోషులగా తేలిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఈసీ వాదిస్తోంది. ఈ ఏడాది జులైలో దీనిపై వాదనల సందర్భంగా ఈసీ సందిగ్థ వైఖరి తీసుకుంది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడం ఈసీ పరిధిలోనే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈసీ ఈ మేరకు స్పష్టమైన వైఖరితో కోర్టు ముందుకువచ్చింది. దోషులుగా తేలి శిక్షకు గురైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలన్న అంశంపై ఈసీ మౌనంవీడి తన వైఖరిని తేల్చిచెప్పాలని జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హాతో కూడిన సుప్రీం బెంచ్‌ కోరింది.

మరిన్ని వార్తలు