మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!

12 Jan, 2015 02:17 IST|Sakshi
మోదీ విజన్‌కు కెర్రీ ఫిదా!

 ప్రధాని కార్యక్రమాలపై అమెరికా విదేశాంగ మంత్రి ప్రశంసల జల్లు
 గాంధీనగర్: ప్రధాని మోదీ విజన్‌పై అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మేకిన్ ఇండియా’, ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ కార్యక్రమాలు అద్భుతమన్నారు. సమ్మిళిత వృద్ధిని కాంక్షించే ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ నినాదం విశ్వవ్యాప్తం కావాలని అభిలషించారు. ఆదివారమిక్కడ వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కెర్రీ ప్రసంగించారు. భారత్-అమెరికా సంబంధాలను  మరింత బలోపేతం చేసుకుకోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఇంతకుమించిన మంచి తరుణం దొరకదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి మేకిన్ ఇండియా నినాదం ‘గెలువు-గెలిపించు’ స్ఫూర్తిగా నిలవాలన్నారు.
 
 రైళ్లలో టీ అమ్ముకున్న ఒక వ్యక్తి భారత అత్యున్నత పీఠంపై కూర్చున్నారంటూ మోదీని అభినందించారు. ‘ఈరోజు సరికొత్త భారత నిర్మాణానికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో  సంతోషంగా భాగస్వాములం అవుతున్నాం. ఎన్నికల  సమయంలో మోదీ ఇచ్చిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదం నన్నెంతో ఆకట్టుకుంది’ అని  అన్నారు. మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకారం అందిస్తామన్నారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. భారత్‌తో వాణిజ్య బంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని కెర్రీ పేర్కొన్నారు.
 
 ‘వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం ఇరుదేశాల మధ్య 2000 సంవత్సరంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. ద్వైపాక్షిక పెట్టుబడులు 30 బిలి యన్ డాలర్లకు చేరాయి. ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగా మేం కూడా చర్యలు చేపడతాం. ప్రజల ఆకాంక్షలను ప్రజాస్వామ్యమే నెరవేరుస్తుందని నిరూపించే ఉమ్మడి బాధ్యత రెండు దేశాలపైనా ఉంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం కెర్రీ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక  అంశాలపై చర్చించారు. ఆయన ఇక్కడి గాంధీ ఆశ్రమా న్ని కూడా సందర్శించి మహిళలతో ముచ్చటించారు. ఆయన వెంట అహ్మదాబాద్‌కు చెందిన నిషా బిస్వాల్ ఉన్నారు. ఆమె ప్రస్తు తం అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖకు ఉపమంత్రిగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు