ఈఎస్‌ఐసీ విద్యార్థులకు దత్తాత్రేయ భరోసా

22 Jan, 2015 00:57 IST|Sakshi
ఈఎస్‌ఐసీ విద్యార్థులకు దత్తాత్రేయ భరోసా

ఢిల్లీ: ఉద్యోగుల రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లోని వైద్య విద్యార్థులు, సిబ్బంది ప్రయోజనాలు కాపాడతామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. వైద్య విద్య నుంచి తప్పుకోవాలని ఈఎస్‌ఐసీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ కార్పొరేషన్ కాలేజీల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలసి ఆందోళనను వివరించారు. దీనిపై స్పందించిన దత్తాత్రేయ వైద్య విద్య పూర్తయేవరకూ కార్పొరేషన్ బాధ్యత తీసుకుంటుందని విద్యార్థులకు భరోసానిచ్చారు.
 
 ఈ విషయంపై ఈఎస్‌ఐసీ డీజీతో దత్తాత్రేయ సమీక్షించారు. విద్యార్థులకు, సిబ్బందికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత డీన్‌ను లేదా ఈఎస్‌ఐసీ డీజీని కలవాలని సమీక్ష అనంతరం చెప్పారు. ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే.. కోర్సులు యథాతథంగా కొనసాగుతాయని, లేదంటే ప్రస్తుతం అడ్మిట్ అయిన విద్యార్థుల కోర్సు పూర్తయే వరకూ ఈఎస్‌ఐసీ వాటిని నిర్వహిస్తుందని దత్తాత్రేయ వెల్లడించారు. కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోని పక్షంలో ఆయా కాలేజీలను ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా వినియోగిస్తామన్నారు. ఇక ఫ్యాకల్టీలను డిప్యుటేషన్‌పై ప్రభుత్వ కాలేజీలకు మారుస్తామని, రిటైరయ్యేవరకూ వారు అక్కడ పనిచేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.

మరిన్ని వార్తలు