సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం

26 Feb, 2020 02:45 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పెన్నా మధుసూదన్, బండి నారాయణస్వామి

పురస్కారాలు స్వీకరించిన బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీలకు చెందిన రచయితలు బండి నారాయణ స్వామి, పెన్నా మధుసూదన్‌లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. 23 భారతీయ భాషల్లో రచనలకు గాను ఏటా ప్రకటించే సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్‌ 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి రాయలసీమ చరిత్ర ఆధారంగా తెలుగులో రాసిన శప్తభూమికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర్‌ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.

కాగా, సంస్కృత భాషలో పెన్నా మధుసూదన్‌ రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన కూడా మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్నారు. పెన్నా మధుసూదన్‌ జడ్చర్లకు చెందినవారు. గతంలో ఆయన సోమనాథ్‌ సంస్కృత పండిట్‌ అవార్డు, పండిట్‌ లట్కర్‌శాస్త్రి మెమోరియల్‌ అవార్డు తదితర పురస్కారాలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సాధువు గులాబ్‌రావు మహారాజ్‌ ఆధ్యాత్మిక తత్వబోధనలపై ప్రజ్ఞాచాక్షుషం రచించారు. కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేశారు.

చాలా ఆనందంగా ఉంది
అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్రలో ఒక రైతు కుటుంబంలో ఒక నిర్దన పరివారంలో పుట్టిన ఒక గొప్ప మహాత్ముడి జీవితాన్ని 850 శ్లోకాల్లో రాశాను. ఆయన జీవితం, ఆయన దార్శనిక విచారాలు, తత్వజ్ఞానాలు ప్రస్తావించాను. ఆ మహాత్ముడి జీవితం తెలియాలి. 34 ఏళ్లు మాత్రమే జీవించారు. 134 పుస్తకాలు,4 భాషల్లో రాశారు. భారతీయ ధర్మాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. మరిన్ని రచనలు చేసేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్నిస్తుంది. –పెన్నా మధుసూదన్‌

అవార్డు రావడం సంతోషకరం
నేను రాసిన శప్తభూమి నవలకు ఈ అవార్డు రావడం పాఠకులకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. దాని ఆధారంగా నాకూ సంతోషాన్నిచ్చింది. తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమకు కూడా తనకంటూ ఒక భాష, సంస్కృతి ఉందని వివిధ ప్రాంతాలకు తెలియపరిచేందుకు ఈ శప్తభూమి రాశాను. రాయలసీమ చారిత్రక మూలాలు 18వ శతాబ్దం నుంచి తీసుకుని ఈ నవల రాశాను. రాయలసీమ కరువు, కరువుల పరంపరలను నవలలో రాశాను. రాయలసీమ కరువు కాటకాలను, సుఖదుఃఖాలను వివిధ ప్రాంతాలతో పంచుకునే అవకాశం లభించింది.
– బండి నారాయణ స్వామి

>
మరిన్ని వార్తలు