మోదీకి బ్యాంకు ఉద్యోగుల లేఖ

5 Jan, 2017 19:01 IST|Sakshi
మోదీకి బ్యాంకు ఉద్యోగుల లేఖ

న్యూఢిల్లీ: ప్రసంశలు కాదు పైసలు కావాలి అంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. కొత్త సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ... బ్యాంకు ఉద్యోగుల సేవలను కొనియాడారు. పాత పెద్ద నోట్ల రద్దును చేసిన నేపథ్యంలో తీవ్ర ఒత్తిడులు ఎదురైనా ఉద్యోగులు బాగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర నాయకులు కూడా బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.

అయితే తమ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాగే ఓవర్‌ టైమ్‌ డ్యూస్‌ కూడా తక్షణమే ఇవ్వాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) డిమాండ్‌ చేసింది. భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ కు అనుబంధంగా ఉన్న ఎన్‌ఓబీడబ్ల్యూ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసింది. చాలా బ్యాంకులు ఓవర్‌ టైమ్‌ డ్యూస్‌ చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు.

‘బ్యాంకు ఉద్యోగులు బాగా పని చేశారని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కానీ ఉద్యోగుల సంక్షేమానికి కచ్చితమైన ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లామ’ని ఎన్‌ఓబీడబ్ల్యూ ఉపాధ్యక్షుడు అశ్వనీ రాణా తెలిపారు. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) డిమాండ్‌ చేసింది.

మరిన్ని వార్తలు