కరోనా: చైనాను కోర్టుకు లాగాల్సిందే

18 May, 2020 09:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణంటూ అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలు గట్టిగా వాదిస్తున్నాయి. వైరస్‌పై కుట్రపూరితంగా వ్యవరించినందుకు చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలంటూ యూఎస్‌తో సహా ఐరోపా ఖండంలోని పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే చైనా నుంచి వైరస్‌ లీక్‌ అయిందనే ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే వైరస్‌‌ వ్యాప్తికి కారణమైన డ్రాగన్‌ను కోర్టుకు ఈడ్చాలంటూ భారతీయ న్యాయవాదులు సైతం ప్రణాళికలు రచిస్తున్నారు. కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా ప్రభుత్వ పనేనని, దానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని లాయర్లు హెచ్చరించారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో నష్టపరిహారం రాబట్టాలని డిమాండ్‌ చేశారు. (మోదీపై విషం కక్కిన అఫ్రిది)

ఈ మేరకు ఆల్‌ ఇండియా బార్‌ అసోషియేషన్‌ నేతృత్వంలోనే న్యాయవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. భారతీయ న్యాయ చట్టాల ప్రకారం విదేశాలపై ఎలాంటి దావా వేయడానికి వీలులేదు. ఈ క్రమంలో సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌ (సీపీసీ)లోని సెక్షన్‌ 86ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైనాపై పిటిషన్‌ వేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిత్తులమారి చైనా పన్నిన కుట్రకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పౌరుల ప్రాణాలను కోల్పోయాయని, దీనికి ఆ దేశం శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయవాదులు లేఖలో ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. (కరోనా: డబ్ల్యూహెచ్‌ఓ వార్షిక సమావేశం ప్రారంభం)

మరిన్ని వార్తలు