అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ

26 Jul, 2018 03:20 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన పిటిషనర్‌ తరఫు లాయర్‌

‘శబరిమల’ ప్రవేశంపై కొనసాగిన వాదనలు

న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్‌ కె.పరాశరన్‌ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది.

సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్‌ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్‌ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి.

దివ్యాంగుల సౌకర్యం పట్టదా?
రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్‌లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్‌ అసహనం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు