భర్త అచేతనావస్థ.. భార్యకు గుండెకోత

2 Jan, 2018 08:41 IST|Sakshi

బరేలీ : ప్రమాదంలో భర్త అచేతన స్థితిలో మంచానికే పరిమితమై ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువైపోవటంతో పూట గడవటం కష్టంగా మారిపోయింది. గర్భవతి అయినప్పటికీ భార్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తోంది. ఇక ఒక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత భర్త చికిత్స కోసం ఆ తల్లి త్యాగానికి సిద్ధపడింది. 

ఉత్తర ప్రదేశ్‌ బరేలీలోని హకీజంగల్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన కదిలించివేస్తోంది. వివరాల్లోకి హరస్వరూప్‌ మౌర్య అనే వ్యక్తి నిర్మాణ పనుల్లో కూలీగా పని చేసేవాడు. గత అక్టోబర్‌లో గోడ కూలి అతనిపై పడి నడుం చచ్చుబడిపోయింది. అప్పటి నుంచి అతను కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన అతని భార్య కష్టం మీద కూలీ పనులకు వెళ్లింది. డిసెంబర్‌ 14న ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. 

అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. భర్త చికిత్స కోసం తన బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది. భార్య చేసే పనికి ముందు భర్త అడ్డుచెప్పినప్పటికీ.. చివరకు అతన్ని ఆమె ఒప్పించింది. ఓ మధ్యవర్తి సాయంతో పొరుగు గ్రామంలోని ఓ జంటకు బిడ్డను అమ్మి.. అలా అమ్మగా వచ్చిన 45,000 రూపాయలతో భర్తకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయించింది. ఇంతలో బంధువులు ఆమెను నిలదీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ప్రభుత్వం సాయం చేయలేదు : మహిళ

సాయం కోసం బంధవుల వద్ద చెయ్యి చాస్తే ఒక్కరూ స్పందించలేదు. రెండు నెలలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాం. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సీఎం హామీ పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. నా భర్త ప్రాణాలు నిలబెట్టుకునేందుకు తనకు ఇంతకు మించి మార్గం కనిపించలేదు అని ఆమె చెబుతోంది. ఇప్పటికే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. వారి పోషణ కష్టంగా మారిందని.. అందుకే భర్తను మాములు మనిషిని చేసేందుకు ఈ పని చేసినట్లు ఆమె వివరించారు. ఇక ఈ అంశంపై స్పందించేందుకు సీఎం కార్యాలయం సిబ్బంది సుముఖత వ్యక్తం చేయటం లేదు.  

మరిన్ని వార్తలు