మూడు ముక్కలు

19 Nov, 2014 03:35 IST|Sakshi
మూడు ముక్కలు

* బీబీఎంపీ విభజనపై కాంగ్రెస్ నేతల నిర్ణయం
* ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నివేదిక

బెంగళూరు : బీబీఎంపీని మూడు ముక్కలు చేయడానికి రంగం సిద్ధమైంది. పాలికెని విభజించి అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీబీఎంపీని విభజించాలా.. వద్దా.. అన్న దానిపై  అభిప్రాయాలు సేకరించడానికి కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బీఎల్. శంకర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మేయర్లు రామచంద్రప్ప, పీఆర్  రమేష్, హుచ్చప్ప, బీఎల్ సింహ సభ్యులుగా ఉన్నారు.  

ఇప్పటికే ఈ కమిటీ సభ్యులు పలు సమావేశాలు నిర్వహించి..   అనేక మంది దగ్గర అభిప్రాయాలు సేకరించారు. బీజేపీ నాయకులు బీబీఎంపీని విభజించరాదని గట్టిగా పట్టుబడుతున్నారు. గతంలో జరిగిన పాలికె సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి పాలికెని విభజించి అభివృద్ధి చేస్తామని పలుసార్లు చెప్పారు. ఇప్పటి కే బీఎల్ శంకర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక తయారు చేసి సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలో  రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
 
మూడు విభాగాలు
కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఎంపీ ృబహత్ మహానగర పాలికె)లోని 100 వార్డులకు ఏడు నగర సభ్యులు, ఒక పురసభ విలీనం చేశారు. తరువాత 198 వార్డులుగా విభజించి బీబీఎంపీ ృబహత్ బెంగళూరు మహానగర పాలికె)గా తయారు చేశారు. అయితే నగర శివార్లలోని ప్రాంతాలు అభివృద్ధి కాలేదని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది.  బెంగళూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని,  అందుకే విభజిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే బెంగళూరును విభజించడానికి బీజేపీ, జేడీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బెంగళూరు కేంద్రం (అప్పటి 100 వార్డులు), బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర విభాగాలుగా విభజించాలని ఆలోచిస్తున్నారు. నగర శివార్లలోని ప్రాంతాలను కలుపుకోవాలని భావిస్తున్నారు. బెంగళూరును విభజించరాదని పలు కన్నడ సంఘాలు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేపట్టాయి.
 
ప్రజలే మేయర్‌ను ఎంపిక చేసుకోవాలి
ప్రస్తుతం పాలికెలో కార్పొరేటర్లు మేయర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. మేయర్ అధికార అవధి  సంవత్సరం. ఒక సంవవత్సరం అధికారంలో ఉంటే మేయర్ పూర్తిగా న్యాయం చేయలేరని,  అభివృద్ధి జరగదని బీఎల్  శంకర్ కమిటీ నివేదికలో పేర్కొన్నారు.  నగర ప్రజలు ఓట్లు వేసి మేయర్‌ను ఎన్నుకుంటారని, అప్పుడే అభివృద్ధి చేయడానికి  సాధ్యమని నివేదికలో తెలిపారు. బీబీఎంపీ మూడు భాగాలు అయిన తరువాత ఒక్కరే మేయర్ ఉంటారా లేక ముగ్గురు మేయర్లు ఉండాలా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక మేయర్ ఉంటే ముగ్గురు ఐఏఎస్ అధికారులు పాలికె కమిషనర్లుగా నియమించాలని కమిటీ సభ్యులు నివేదికలో సూచించారు.

మరిన్ని వార్తలు