ఆ లేఖ సారాంశం.. పాక్‌తో యుద్ధమా?

20 May, 2017 18:07 IST|Sakshi
ఆ లేఖ సారాంశం.. పాక్‌తో యుద్ధమా?

న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు దేశం నుంచి దాడులు పెరుగుతున్న సమయంలో భారతీయ వాయుదళాధిపతి బీఎస్‌ ధనోవా భారత వాయు సేన(ఐఏఎఫ్‌)లో పని చేసే 12వేల మంది అధికారులకు ఓ లేఖ రాశారు. 'అతి కొద్ది సమయంలో ఆపరేషన్లకు సిద్ధం కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో దాయాది దేశంతో పెద్ద ప్రమాదం పొంచి వుంది. అతి కొద్ది రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్‌కు దిగాల్సిన పరిస్ధితి ఉంది. ఇందుకోసం మీరందరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ట్రైయినింగ్‌లో అందుకు తగిన విధంగా తర్పీదు పొందాలి' ఇది ఆ లేఖ సారాంశం.

ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. నెల రోజుల క్రితం ధనోవా ఈ లేఖను ఐఏఎఫ్‌ అధికారులకు రాశారని తెలిపింది. ధనోవా లేఖను విశ్లేషించిన నిపుణులు.. పాకిస్తాన్‌తో యుద్ధం గురించే ఎయిర్‌ చీఫ్‌ ఈ లేఖను అధికారులకు రాసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ప్రేరిపిత ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు వాయుసేనను రంగంలోకి త్వరలో దింపబోతున్నారనడానికి ఈ లేఖ సంకేతమని అంటున్నారు.

వాయుసేనలో మొత్తం 42 స్వాడ్రన్లకు అనుమతి ఉన్నా.. కేవలం 33 స్వాడ్రన్లకు సరిపడే విమానాలు మాత్రమే భారత్‌కు అందుబాటులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్‌కు దిగాలని అధికారులను లేఖ ద్వారా ధనోవా కోరారని నిపుణులు చెబుతున్నారు. జరగబోయే దాన్ని ఆపలేం.. ప్రొఫెషనల్‌గా వ్యవహరించి యుద్ధానికి సిద్ధం కావాలని కోరడంలో ఉన్న ఆంతర్యం ఇదేనని అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం శత్రువును కూడా బలంగా మార్చిందనే విషయాన్ని మర్చిపోకూడదని, అప్పుడే విజయం సాధించగలమనే ధనోవా సూచనను ఆయన దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్నారు.

యుద్ధానికి సంబంధించిన విషయాలనే కాకుండా.. ఎయిర్‌ఫోర్స్‌ను పీడిస్తున్న రెండు విషయాలను ప్రస్తావించారు. అవి ఒకటి ఫేవరేటిజం, రెండు లైంగిక వేధింపులు. ప్రత్యేక ఆపరేషన్స్‌కు అధికారుల ఎంపికలో నిజాయితీ కనిపించడం లేదని ఆవేదనను లేఖలో వెలిబుచ్చారు ధనోవా. సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలే తప్ప వేధించకూడదని అది సేనకు ఎంతమాత్రం సహాయపడదని చెప్పారు. ఈ రెండు ప్రొఫెషనలిజాన్ని దెబ్బతీస్తాయని.. ప్రొఫెషనలిజం దెబ్బతిన్న చోట గెలుపు ఉండదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు