కృష్ణ వరదతో జాగ్రత్త: కేంద్ర జల సంఘం

26 Oct, 2013 02:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతున్నందున ముప్పు పొంచి ఉందని కేంద్ర జలసంఘం రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది. దాన్ని ఎదుర్కోడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. ‘‘ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో వరద నీరు బాగా పెరుగుతోంది. శనివారం ఉదయానికల్లా నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరవచ్చు’’ అంటూ ప్రభుత్వానికి పంపిన హెచ్చరికల్లో పేర్కొంది. శ్రీశైలం జలాశయానికి 24 గంటల వ్యవధిలో 6.8769 టీఎంసీల నీరు వచ్చి చేరింది! దాంతో నీటి నిల్వ శుక్రవారం సాయంత్రానికి 204 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం డ్యాం, పవర్ హౌస్, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాల్లో రోడ్లపై కొండ చరియలు విరిగిపడటంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు