ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టారా?

25 Jan, 2020 20:59 IST|Sakshi

న్యూఢిల్లీ: తెల్లటి గుబురు గడ్డం, ముడతలు పడిన కళ్లు వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్న ఈ నాయకుడిని గుర్తు పట్టారా? ముఖంతో చిరునవ్వుతో ఈ ఫొటోలోని వ్యక్తిని మొదట చూసినవారు ఎవరైనా ఆయన సాహసికుడని అనుకుంటారు. మంచు కొండల్లో చిక్కుపోయి చాలా కాలం తర్వాత వెలుగులోకి వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. అయితే ఇందులో కొంతమేరకు వాస్తవం ఉంది. ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నేషనల్​ కాన్ఫరెన్స్ (ఎన్​సీ) ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా. ఎప్పుడూ నున్నటి గడ్డంతో కనిపించే ఆయనను ఇలా పోల్చుకోవడం కష్టమే. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన ఫొటో బయటి ప్రపంచానికి కనిపించింది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత గతేడాది ఆగస్టు నుంచి శ్రీనగర్‌లో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. అప్పటి నుంచి బయట ప్రపంచంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి. అక్టోబర్‌లో కొంచెం పెరిగిన గడ్డంతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు ఆయనను గుర్తుపట్టేలా ఉన్నారు. కానీ ఇప్పుడు గడ్డం ఎక్కువగా పెరగడంతో ఆయనను పోల్చుకోవడం కష్టం. గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చే వరకు గడ్డం తీయరాదని ఒమర్‌ నిర్ణయించుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 10న ఆయన 50వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలో మాత్రం ఆయన వయసు మళ్లిన వృద్ధుడిలా కన్పిస్తున్నారని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘ఒమర్‌ అబ్దుల్లా ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. కానీ తాజా ఫొటోలో ఆయనను చూస్తుంటే 30 ఏళ్లు గడిచిపోయినట్టుగా కన్పిస్తున్నార’ని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్‌ అశోక్‌ దామిజా పేర్కొన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్, ఒమర్‌ అబ్దుల్లాతో రాజకీయ విభేదాలున్నా ఆయనను ఇంతకాలం నిర్బంధంలో ఉంచడాన్ని ఖండిస్తున్నానని ప్రముఖ కాలమిస్ట్‌, రాజకీయ విశ్లేషకుడు జునైద్‌ ఖురేషీ అన్నారు. ఎటువంటి నేరారోపణలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని ఆరు నెలలుగా నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ మద్దతుదారులు మాత్రం ఒమర్ ఫొటోపై వ్యంగ్యంగా స్పందించారు. కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆయన సంతోషంగా ఉన్నారనడానికి ఒమర్‌ ముఖంలో చిరునవ్వే రుజువని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్బంధంలో ఉన్న ఒమర్‌ మళ్లీ ట్విటర్‌లోకి వచ్చారని చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ సోజ్‌ ఖండించారు. ప్రధాన రాజకీయ నాయకులకు కశ్మీర్‌లో ఇప్పటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం లేదని వెల్లడించారు. కాగా, ఒమర్‌తో పాటు ఆయన తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కూడా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..)

మరిన్ని వార్తలు