మనోభావాలను దెబ్బతీశారు

6 Mar, 2015 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో ముసలం ముదిరిపోయింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి వ్యవస్థాపక సభ్యులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తప్పించిన తీరుపై మరో సీనియర్ నేత మయాంక్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు రాజీనామాకు సిద్ధపడిన తరువాత కూడా మనీష్ సిసోడియా వీరి తొలగింపు తీర్మానాన్ని తీసుకురావటంపై తాను దిగ్భ్రాంతి చెందానని మయాంక్ గురువారం తన బ్లాగులో పేర్కొన్నారు. గురువారం జాతీయ కార్యవర్గ సమావేశంలో మయాంక్ ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకమంది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గురువారం జరిగిన కీలకమైన పీఏసీ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనల గురించి బయటపెట్టినట్లయితే తనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం హెచ్చరించిందన్నారు. మయాంక్ ఆరోపణలు ఆప్‌లో ఉన్నతస్థాయి నాయకత్వం మధ్యన విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. మయాంక్ తన బ్లాగులో వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

  •  
  • ఢిల్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెడతానని ప్రశాంత్ భూషణ్ పలుమార్లు నాతో అన్నారు. అభ్యర్థుల ఎంపికపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు అయ్యేంత వరకూ మిగతా నేతలు నియంత్రించారు.
  • కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌ల మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. ముగ్గురి మధ్య తీవ్రమైన విభేదాలు పెరిగిపోయాయి.
  • ఫిబ్రవరి 26 రాత్రి జాతీయ కార్యవర్గ సభ్యులు అరవింద్ కేజ్రీవాల్‌ను కలవటానికి వెళ్లినప్పుడు, ఆ ఇద్దరూ పీఏసీలో ఉంటే తాను కన్వీనర్‌గా ఉండనని ఆయన కచ్చితంగా చెప్పారు.

 
'జిందాల్'లో కేజ్రీవాల్
బెంగళూరు: తీవ్ర మధుమేహం, రక్తపోటు, దగ్గుతో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... చికిత్స కోసం బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో గురువారం చేరారు. పదిరోజులపాటు ఆయన ఇక్కడే ఉంటారు.
 
పార్టీని విడిచిపెట్టను: యాదవ్
ఆప్ పీఏసీ నుంచి తమను తొలగించిన పరిణామాల గురించి ఆప్ సీనియర్ నేత మయాంక్ గాంధీ బ్లాగులో చేసిన వ్యాఖ్యలపై స్పందించటానికి యోగేంద్ర యాదవ్ నిరాకరించారు. ఆమ్ ఆద్మీపార్టీ అనే భావన వ్యక్తులకు అతీతమైనదని ఆయన అన్నారు. ఆప్‌ను విడిచిపెట్టేది లేదని యాదవ్ చెప్పారు.

మరిన్ని వార్తలు